నో డౌట్‌.. 2020 మ‌ణిశ‌ర్మ‌దే

July 04, 2020

ఒక‌సారి ఫామ్ కోల్పోయి సినిమాలు త‌గ్గిన సంగీత ద‌ర్శ‌కుడు మ‌ళ్లీ పుంజుకోవ‌డం, టాప్ ఫామ్‌లోకి రావ‌డం అంటే క‌ష్ట‌మే. ఇలాంటి వాళ్లు మ‌ళ్లీ సినిమా అవ‌కాశాలు అందుకుంటే అందుకోవ‌చ్చు కానీ.. టాప్ లీగ్‌లోకి రావ‌డ‌మైతే దాదాపుగా జ‌ర‌గ‌దు. ఐతే మ‌ణిశ‌ర్మ మాత్రం ఈ ఒర‌వ‌డిని మారుస్తున్నాడు. ప‌దేళ్ల కింద‌టే మ‌ణిశ‌ర్మ‌ కెరీర్ క్లోజ్ అనుకున్నారు కానీ.. ఆయ‌న మ‌ళ్లీ త‌న ఉనికిని చాటుకున్నారు. అప్పుడ‌ప్పుడూ త‌న‌దైన శైలిలో పాట‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇక గ‌త ఏడాది ఇస్మార్ట్ శంక‌ర్ ఆడియోతో ఉర్రూత‌లూగించేయ‌డంతో ఇండ‌స్ట్రీ జ‌నాలు మ‌ళ్లీ ఆయ‌న వైపు చూడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. 2020లో మ‌ణిశ‌ర్మ సంగీతం అందించ‌బోయే సినిమాల లిస్టు చూసి షాక‌వ్వ‌క త‌ప్ప‌దు.
ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి-కొర‌టాల శివ‌ల క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతున్న భారీ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. గ‌త ద‌శాబ్దంన్న‌ర కాలంలో మ‌ణిశ‌ర్మ‌కు ద‌క్కిన అతిపెద్ద అవ‌కాశంగా దీన్ని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం మ‌ణి ఎంత క‌సిగా ప‌ని చేస్తాడో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తాజాగా మ‌రో క్రేజీ మూవీకి మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక‌య్యాడు. అదే.. విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా తెర‌కెక్కుతున్న నార‌ప్ప‌. ఈ చిత్రం అసుర‌న్ మూవీకి రీమేక్. బ్యాగ్రౌండ్ స్కోర్ కింగ్ అయిన మ‌ణి.. ఈ సినిమాతో త‌న ప‌వ‌ర్ చూపిస్తాడ‌ని అభిమానులు ఆశిస్తున్నారు. మ‌రోవైపు పూరి జ‌గ‌న్నాథ్‌-విజ‌య్ దేవ‌ర‌కొండ క‌ల‌యిక‌లో మొద‌లైన పాన్ ఇండియా మూవీకి కూడా మ‌ణిశర్మే సంగీత ద‌ర్శ‌కుడు. వీటితో పాటు రామ్ హీరోగా తెర‌కెక్కుతున్న థ్రిల్ల‌ర్ మూవీ కూడా మ‌ణి ఖాతాలోనే ఉంది. ఈ నాలుగు సినిమాలూ 2020లోనే రిలీజ‌వుతున్నాయి. కాబ‌ట్టి ఈ ఏడాది మ‌ణిశ‌ర్మ‌దే అని చెప్పొచ్చు.