బ్రేకింగ్ న్యూస్‌!... పారికర్ క‌న్నుమూత‌

May 29, 2020

బీజేపీ సీనియ‌ర్ నేత, గోవా సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్ ఇక లేరు. గోవాలో బీజేపీకి కొత్త ఊపిరి ఊద‌ట‌మే కాకుండా బీజేపీ జాతీయ శాఖ‌లోనూ స‌త్తా క‌లిగిన నేత‌గా ఎదిగిన పారిక‌ర్‌... ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కేబినెట్ లో ర‌క్ష‌ణ శాఖ మంత్రిగానూ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. మ‌నోహ‌ర్ పారిక‌ర్ ప‌నితీరుపై న‌మ్మ‌కంతో గోవా సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయించి మ‌రీ మోదీ ఆయ‌న‌ను త‌న కేబినెట్ లో చేర్చుకున్నారు. పారిక‌ర్ ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే పాకిస్థాన్‌పై స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ జ‌రిగాయి. ఈ దాడుల‌తో పాక్‌లో భ‌యాన్ని పుట్టించిన భార‌త ర‌క్ష‌ణ శాఖ స‌రికొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభించింద‌ని చెప్పాలి. ఈ దాడుల‌కు సంబంధించి అత్యంత చాక‌చ‌క్యంగా వ్వ‌వ‌హ‌రించిన పారిక‌ర్‌... యావ‌త్తు భార‌త ప్ర‌జ‌ల దృష్టిలో హీరోగా నిలిచార‌ని చెప్పాలి. 

క్లోమ గ్రంధికి సోకిన కేన్స‌ర్ కార‌ణంగా తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన పారిక‌ర్‌ను... మోదీ తిరిగి గోవా సీఎంగా పంపారు. సీఎం హోదాలోనే అమెరికాతో పాటు ముంబైలోనూ చికిత్స తీసుకున్న పారిక‌ర్‌... కొంత మేర కోలుకున్నార‌ని చెప్పాలి. చికిత్స అనంత‌రం ముఖానికి మాస్క్ తోనే సీఎంఓలో విధుల‌కు హాజ‌రైన పారిక‌ర్ విధి నిర్వ‌హ‌ణ అంటే త‌న‌కెంత ఇష్ట‌మో చెప్ప‌క‌నే చెప్పేశారు. అంతా బాగుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలోనే పారిక‌ర్ మ‌రోమారు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి కాగా... అప్ప‌టిక‌ప్పుడే చికిత్స ప్రారంభించినా ఫ‌లితం లేకుండా పోయింది. ఈ క్ర‌మంలో కాసేప‌టి క్రితం ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లుగా గోవా సీఎంఓ ప్ర‌క‌టించింది. ఈ వార్త‌తో అటు గోవా బీజేపీ శాఖ‌తో పాటు బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గం కూడా షాక్‌లో కూరుకుపోయింది.