ప్రాణాలు తీసిన కంపెనీకి ప్రశంసలా జగన్?

August 06, 2020

విశాఖలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర దుర్ఘటనలో ఇప్పటికే 11 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మల్టీ నేషనల్ కంపెనీగా ఉన్న ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టిరిన్ అనే విషవాయువు లీకై పెను విలయమే సృష్టించిందని చెప్పాలి. ఈ ప్రమాదంపై వెనువెంటనే స్పందించిన స్థానికులు, స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎప్ బృందాలు ప్రాణ నష్టాన్ని అయితే తగ్గించాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత పెద్ద ప్రమాదానికి, పెద్ద ఎత్తున ప్రాణ నష్టానికి, వెయ్యి మందికి పైగా ఆస్పత్రుల పాలు కావడానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పట్ల సీఎం హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరే పలు అనుమానాలకు తావు ఇస్తోందన్న విమర్శలు రేకెత్తుతున్నాయి. ప్రమాదం నేపథ్యంలో హుటాహుటీన విశాఖకు వెళ్లిన జగన్.. సంఘటనా స్థలిని సందర్శించకుండానే, ఆస్పత్తుల్లో చికిత్స సొందుతు్న వారిని పరామర్శించడంతోనే తన పర్యటన ముగిసినట్టుగా వ్యవహరించారు. అంతేకాకుండా ఈ పర్యటనలో దోషిగా నిలబడ్డ ఎల్జీ పాలిమర్స్ పై చర్యలు తీసుకుంటామన్న కనీస ప్రకటన కూడా లేకుండానే జగన్ తన పర్యటనను ముగించిన తీరు కూడా వివాదాస్పదంగానే ఉందని చెప్పక తప్పదు.

అసలు జగన్ విశాఖ పర్యటన స్టార్ట్ కాకముందే.. విమానాశ్రయంలోనే ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులతో మాట్లాడటం చూస్తుంటే... ఈ ప్రమాదానికి కారణమైన కంపెనీని అలా వదిలిపెట్టేందుకే జగన్ సిద్ధమయ్యారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. విశాఖలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆస్పత్రికి బయలుదేరుతున్న సందర్భంగా తన కారులో ఎక్కిన పార్టీ ముఖ్య నేత, పార్లమెంటరీ పార్టీ నేత విజయపాయిరెడ్డిని ఉన్నపళంగా దించేసి వెళ్లిన జగన్... ఎక్కడ కూడా కంపెనీ నిర్లక్ష్యంపై పల్లెత్తు మాట కూడా మాట్లాడకపోవడం కూడా ఆశ్చర్యంగానే ఉందని చెప్పాలి. తన పర్యటనలో కీలకమైన బాధితుల పరామర్శ కంటే ముందే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులతో భేటీ కావడం, ఈ భేటీ అంతా ఏదో మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారితో చర్చించినట్టుగా వ్యవహరించిన తీరు కూడా ఆశ్చర్యకరంగానే ఉందని చెప్పాలి. అది కూడా ఎయిర్ పోర్టు లాంజీలోనే ఈ భేటీని నిర్వహించడం కూడా అనుమానాలకు తావిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే.. ఇంత పెద్ద ప్రమాదానికి కారణంగా నిలిచిన ఎల్జీ పాలిమర్స్ ను జగన్ ఏమీ అనకపోగా... సదరు కంపెనీపై కఠిన చర్యలో, లేదంటో లైటర్ వేలో చర్యలో తీసుకుంటామన్న ఒక్కటంటే ఒక్క మాట కూడా జగన్ అనకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నవాదనలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా ఎల్జీ పాలిమర్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాత కంపెనీ అంటూ జగన్ వ్యాఖ్యానించడం చూస్తుంటే.. అసలు ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైన కంపెనీపై చర్యలుంటాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కంపెనీకి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలున్నాయని కూడా జగన్ సంచలన వ్యాఖ్య చేశారు. అంతటితో ఆగని జగన్... కంపెనీ కార్యకలాపాలు త్వరలో పున:ప్రారంభమవుతాయని చెప్పడం మరింత విడ్డూరమనే చెప్పాలి. ఏదో తానే ఆ కంపెనీ నిర్వాహకుడినన్న రీతిలో జగన్ వ్యవహరించారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఇక మరో ఆసక్తికరమైన అంశమేమంటే... ఈ కంపెనీ పొట్టనబెట్టుకున్న వారి కుటుంబ సభ్యులకు అదే కంపెనీలో ఉద్యోగాలిప్పిస్తామని కూడా జగన్ చెప్పడం వింతలకే వింత అని చెప్పాలి. 

మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. జగన్ ప్ర‌భుత్వ పెద్దల బంధువుల‌కు ఉన్న పాలిమ‌ర్ కంపెనీల‌కు ఎల్జీ పాలిమార్స్ సూప‌ర్ స‌ప్ల‌య‌ర్ అని, అందుకే ఈ మీన‌మేషాలు, నాన్చుడు ధోర‌ణి అనే వాద‌న‌లూ వినిపిస్తున్నాయి. ఎల్జీ పాలిమర్స్ పట్ల జగన్ వ్యవహరించిన మెతకదనం చూస్తుంటే.... మీకు చెందిన కంపెనీలు ఎల్జీ పాలిమర్స్ కు క్లైంట్లు అని సోషల్ మీడియా చేస్తున్న ఆరోపణలు నిజమేనేమో అనుమానాలు బలపడుతున్నాయి. ఇదిలా ఉంటే... ఈ ప్రమాదం వల్ల జరిగిన నష్టం ఇంతటితో అయిపోలేదనే చెప్పాలి. ఆ ప్రాంతంలో విష వాయువు పీల్చిన వారికి 10 వేలు ఇస్తామని జగన్ ప్రకటించారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారి కంటే క్షతగాత్రుల బతుకే ఘోరమని చెప్పాలి. ఎందుకంటే వీరు జీవితాంతం ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. భోపాల్ దుర్ఘటనే ఇందుకు నిదర్శనం. మొత్తంగా ఎల్జీ పాలిమర్స్ కారణంగా జరిగిన ఘోర నష్టంపై ఓ సీఎం హోదాలో జగన్ వ్యవహరించిన తీరు మాత్రం పెను అనుమానాలకు తావిస్తోందని చెప్పక తప్పదు. 

ఈ వీడియో చూడండి :

https://twitter.com/i/status/1258622956390907906