జుకర్ బర్గ్ ఆడియో లీక్ ఎందుకంత సంచలనం? అందులో ఏముంది?

August 07, 2020

మార్క్ జుకర్ బర్గ్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్ బుక్ సీఈవోగా వ్యవహరిస్తున్న ఆయన.. తాజాగా తన ఉద్యోగులతో నిర్వహించిన అంతర్గత సమావేశానికి సంబంధించిన ఆడియో ఒకటి లీక్ అయి సంచలనంగా మారింది.
ముఖ్యులైన ఉద్యోగులతో మాట్లాడిన జుకర్ మాటల్లో కొన్ని అంశాలు రానున్న రోజుల్లో కొత్త రచ్చకు తెర తీయటం ఖాయమంటున్నారు. మరికొద్ది నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ.. డెమొక్రాటిక్ అభ్యర్థి ఎలిజబెత్ వారెన్ కానీ అధ్యక్ష స్థానానికి ఎన్నికైతే సంస్థకు డేంజర్ అన్న మాట ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
ఆమె కానీ అధ్యక్ష పదవిని చేపడితే సంస్థకు చట్టపరమైన సవాళ్లు ఎదురవుతాయని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించిన ఆడియో టేప్ ఒకటి బయటకు వచ్చింది. సంస్థను దెబ్బ తీసే సవాళ్లను తాము ఎదుర్కొంటామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. లీకైన ఆడియో అంశాన్ని ది వెర్జ్ బయటకు తీసుకొచ్చింది.
ఇక.. లీకైన ఆడియోలో ఏముంది? అందులో జుకర్ ఏమేం చెప్పారు? ఏ అంశాల మీద ఆయన ఫోకస్ ఉందన్న విషయంలోకి వెళితే.. మొత్తం ఆరు అంశాల్ని ప్రదానంగా ప్రస్తావించినట్లు చెప్పాలి.   ఆ అంశాల విషయంలోకి వెళితే..
%  డెమొక్రటిక్ అభ్యర్థి అమెరికా అధ్యక్ష పదవిని చేపడితే సంస్థను దెబ్బ తీయటంతో పాటు.. వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ తో పోటీ పడాలనే లక్ష్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంది.
% ఫేస్ బుక్.. అమెజాన్.. గూగుల్..లాంటి దిగ్గజ టెక్ కంపెనీల్ని ఎలిజబెత్ వారెన్ టార్గెట్ చేసే వీలుంది.
% చైనాకు చెందిన టిక్ టాక్ ను ఎదుర్కోనేందుకు ఫేస్ బుక్ కొత్త యాప్ ను తీసుకురానుంది. లాసోను ప్రయోగాత్మకంగా లాంచ్ చేస్తున్నాం.
% ఫేస్ బుక్ క్రిప్టో కరెన్సీ లిబ్రాకు సంబంధించిన వివరాల్ని జుకర్ తన టేప్ లో ప్రస్తావించారు.
% సెక్యురిటీ కోసం ట్విట్టర్ మొత్తం ఆదాయం కంటే ఎక్కువగా ఫేస్ బుక్ పెట్టుబడులు పెట్టనుంది.
ఈ ఆడియో లీక్ అయిన వేళ.. వారెన్ వరుస ట్వీట్లు చేశారు. జుకర్ వ్యాఖ్యల్ని తప్పు పట్టారు. వాట్సాప్.. ఇన్ స్టా లాను ఫేస్ బుక్ సొంతం చేసుకోవటం ద్వారా ఇటీవల కాలంలో మార్కెట్ అధిపత్యాన్ని సంపాదించిందని.. సోషల్ నెట్ వర్కింగ్ ట్రాఫిక్ లో 85 శాతం కంటే ఎక్కువ ఫేస్ బుక్ సంస్థకే పోతుందని పేర్కొన్నారు.
తనను ఇరుకున పెట్టేలా వచ్చిన వెర్జ్ కథనాన్ని జుకర్ ఖండించారు. తన ఫేస్ బుక్ పేజీలో ఒక ప్రకటనను విడుదల చేశారు. తమ ఉద్యోగులతో భేటీ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలన్ని పూర్తిగా ప్రైవేటు గా పేర్కొన్నారు. అయినప్పటికీ ఆసక్తి ఉన్నోళ్లు ఫిల్టర్ చేయని వెర్షన్ ను పరిశీలించొచ్చని పేర్కొంటూ ఒక లింకును షేర్ చేశారు. మొత్తంగా వెర్జ్ కథనం సంచలనంగా మారటమే కాదు.. ఫేస్ బుక్ ను ఇబ్బందుల్లో పడేలా చేసిందన్న మాట వినిపిస్తోంది.