వాట్ ఎన్ ఐడియా సర్ జీ... గవర్నమెంట్ మసాజ్

July 06, 2020

ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాలు కూడా తమ విధానాలు మార్చుకుంటున్నాయి. ప్రభుత్వంలో చాలా శాఖలు చేసేది వ్యాపారమే. విద్యుత్తు శాఖ, నగర నీటి పారుదల శాఖ, రైల్వే శాఖ, రవాణా శాఖ... ఇలాంటి ఎన్నో శాఖలు వ్యాపారమే చేస్తాయి. అందులో సేవ చాలా పరిమితం. ఇక రైల్వే అయితే సిగరెట్లపై ట్యాక్సులు పెంచినట్లు ప్రతి సంవత్సరం ధరలు పెంచుతుంది. సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండే బోగీలను మాత్రం పెంచదు. ఇంకా డబ్బులు సరిపోవడం లేదట... అందుకే రైల్వేలు కొత్త వ్యాపారం మొదలుపెట్టాయి.
తాజాగా ఆదాయాన్ని పెంచుకునేందుకు భారతీయ రైల్వే రైళ్లలో మసాజ్ సెంటర్లను ఏర్పాటు చేసి డబ్బులు సంపాదించాలని ఐడియా వేసింది. నిజానికి ఈ ఐడియా బాగుంది. మనం ప్రయాణాలు ఎక్కువగా చేసేది ఏదో ఒక కార్యక్రమానికి హాజరు కావడానికే కదా. రైల్లో ఏం తోచక ఖాళీగా కూర్చుంటాం. కొన్ని గేమ్స్ ఆడుతూ ఇతర ప్రయాణికులను నసపెడతుంటాం. ఇక ఆ ఇబ్బందులు అక్కర్లేకుండా... రైల్లో వెళ్లేటపుడే రెడీ కావచ్చు. రిలాక్స్ అవ్వచ్చు. తొలివిడతగా ఇండోర్ నుంచి ప్రారంభం అయ్యే 39 రైళ్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఫుట్ మసాజ్, హెడ్ మసాజ్ సేవలను ప్రస్తుతానికి అందుబాటులోకి తెచ్చారు. హిట్ అయితే... ఇక అన్ని రైళ్లలో రకరకాల మసాజ్ లు ప్రవేశపెడతారు. భలే టైం సేవర్ ఇది.
రైల్వే బోర్టు మీడియా డైరెక్టర్ రాజేశ్ బాజ్ పాయ్ దీని గురించి వెల్లడించారు. రైల్వే చరిత్రలో ఇలాంటి సేవలను అందుబాటులోకి తీసుకువస్తుండటం ఇదే తొలిసారి. మసాజ్ సేవలతో ప్రయాణికులు రిలాక్స్ అవుతారు, వారికి సమయం సద్వినియోగం అవుతుంది. రూ. 20 లక్షల అదనపు ఆదాయం చేకూరే అవకాశం ఉందన్నారు.