కేజ్రీవాల్ పార్టీకి ప్రచారం చేస్తున్న 'ఎంబీఏ ఛాయ్‌వాలా'.. ఎవరీయన

August 06, 2020

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. ఓ ఛాయ్‌వాలా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ హెడ్ క్వార్టర్ వద్ద గురువారం ఓ టీ స్టాల్ తెరిచాడు. అక్కడకు వచ్చిన వారికి అతను ఉచితంగానే వెరైటీ టీలు అందిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఓ కప్పు టీ ద్వారా ఈ అయిదేళ్లలో కేజ్రీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నాడు.

కేజ్రీ పాలనపై సదరు ఛాయ్‌వాలా సంతృప్తిగా ఉన్నాడు. ఎన్నికల సమయం కావడంతో ఏఏపీ కార్యాలయం వద్ద టీస్టాల్ తెరిచి వెరైటీ ప్రచారం చేస్తున్నాడు. ఏఏపీ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల పేరుతో వివిధ రకాల టీలు ఉచితంగా సర్వ్ చేస్తున్నాడు. ఆ ఛాయ్‌వాలా పేరు ప్రఫుల్ బిల్లోర్. అతనిని స్థానికంగా ఎంబీఏ ఛాయ్‌వాలా అని పిలుస్తారు.
ప్రఫుల్ బిల్లోర్ కొద్ది రోజుల క్రితం కేజ్రీవాల్‌ను కలిసి ఎన్నికల నేపథ్యంలో తాను ఏఏపీ కార్యాలయం ముందు టీస్టాల్ ఏర్పాటు చేసి, ఉచితంగా సర్వ్ చేస్తానని చెప్పాడు. కేజ్రీ ప్రభుత్వం విద్య, క్రీడలకు ఇచ్చిన ప్రాధాన్యతను సూచించేలా శిక్షా వాలీ ఛాయ్, హెల్త్ కోసం చేసిన కార్యక్రమాలను గుర్తు తెచ్చేలా స్వస్థ్యా వాలీ చాయ్, తక్కువ ధరకే విద్యుత్, నీళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా ఎన్నో కార్యక్రమాలను గుర్తుకు తెచ్చేలా ప్రత్యేక ఛాయ్‌లు సర్వ్ చేస్తున్నాడు.
తనకు ఏ రాజకీయ పార్టీతోను సంబంధం లేదని, కానీ కేజ్రీ ప్రభుత్వం చేసిన మంచి పనిని తనదైన మార్గంలో అభినందిస్తున్నానని ప్రఫుల్ బిల్లోర్ చెప్పాడు. ఇతని మార్గంలోనే మరో 30 మంది వాలంటీర్లు పలు అసెంబ్లీ నియోజకర్గాల్లో ఇలాంటి టీ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారట. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మంచి చేసినా తాను ఇలాగే చేస్తానని ప్రఫుల్ అంటున్నాడు. ఈ ఆలోచన ద్వారా కేజ్రీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి మరింత సులభంగా వెళ్తాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అంటున్నారు.