APNRT: బాధ్యతలు చేపట్టిన మేడపాటి వెంకట్

November 14, 2019

ఇటీవలే ఏపీ ఎన్నార్టీ ఛైర్మన్ గా నియమితులైన మేడపాటి వెంకట్ తాజాగా బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు హయాంలో ప్రారంభించిన ఆంధప్రదేశ్ తెలుగు ప్రవాస సంఘం (ఏపీఎన్నార్టీ) కి మొదటి ఛైర్మన్ డాక్టర్ రవి వేమూరి నియమితులు కాగా తెలుగుదేశం ఓటమి అనంతరం ఆయన రాజీనామా చేశారు. ఇటీవలే ఆ బాధ్యతలను మేడపాటి వెంకట్ కు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన తాజాగా బాధ్యతలు చేపట్టారు. 

శుక్రవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ  విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారందరికీ నిత్యం ఏపీ ఎన్నార్టీ అండగా ఉంటుందన్నారు. ఆపత్కాలంలో అందుబాటులో ఉండటంతో పాటు ఎన్నారైలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని రకాల సదుపాయాలు అందిస్తుందన్నారు. అదేసమయంలో ఏపీ అభివృద్ధిలో వారిని భాగస్వాములు చేసి, పెట్టుబడులకు మంచి అవకాశాలు కల్పించడంలోనూ ఎన్నార్టీ సహకరిస్తుందన్నారు. ఎన్నారైలు ఏపీ అభివృద్ధికి తమ వంతు కృషిచేయాలని, ఎవరి స్థాయిలో వారు పెట్టబడులు పెట్టాలని కోరుతూ... ఆ క్రమంలో అవసరమైన సాయం కోసం తనను నేరుగా సంప్రదించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్నార్టీ సీఈవో కొడాలి భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.