మేడారం జాతర: భక్తుడి అరుదైన కోరిక నెరవేర్చిన దేవత

August 07, 2020

తెలంగాణలో రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతర మరోసారి మొదలైంది. అన్ని దారులూ మేడారం వైపునే అన్న చందంగా భక్తులు ఇప్పుడు మేడారం వైపు చూస్తున్నారు. కోరిన కోర్కెల్ని తీర్చటంలో సమ్మక్క.. సారలక్క అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లాన్ని) సమర్పించటం ఇక్కడ ఆనవాయితీ.
పిల్లల కెరీర్ తో పాటు.. పెళ్లి.. ఆరోగ్యం.. ఇలా చాలా అంశాలకు సంబంధించి మొక్కులు మొక్కుకోవటం పరిపాటి. తాజాగా అందుకు భిన్నంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన దంపతులు తమ పెంపుడు కుక్కకు అనుకున్న మొక్కును తీర్చుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ దంపతులు తామెంతో అల్లారు ముద్దుగా పెంచుకునే పెంపుడు కుక్క తప్పిపోయింది.
అది మళ్లీ దొరికితే దాని నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించుకుంటామని మొక్కుకున్నారట. విచిత్రంగా మొక్కు తర్వాత పోయిన పెంపుడు కుక్క దొరికిందట. దీంతో.. వారి ఆనందానికి అవధులు లేకుండా పోవటమే కాదు.. కుక్క బరువుకు సరిపోయేంత బెల్లాన్ని (బంగారం) అమ్మవార్లకు సమర్పించుకొని మొక్కు తీర్చుకున్నారు. ఈ వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.