పవన్‌ను లేపబోయి.. చిరును తక్కువ చేసి మాట్లాడిన నాగబాబు

July 15, 2019

మెగా బ్రదర్ నాగబాబు.. కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు. మొదట్లో వివాద రహితుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన.. కొద్ది నెలల క్రితం నందమూరి బాలకృష్ణతో వివాదంతో దాన్ని పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి ఏదో ఒక విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. దీనికితోడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు ఆయన.. తన తమ్ముడు, పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరిపోయారు. కల్యాణ్ బాబు ఆహ్వానాన్ని కాదనలేక పార్టీలో చేరానని, జనసేన విజయం కోసం కష్టపడతానని చెప్పుకొచ్చారు. అప్పుడే ఆయనకు నరసాపురం పార్లమెంట్ టికెట్ కేటాయించారు జనసేన అధినేత పవన్. దీంతో నాగబాబు ఎన్నికలకు ముందు అక్కడ జోరుగా ప్రచారం నిర్వహించారు. అంతేకాదు, గ్లామర్ తోడవడం కోసం తన కూతురు నిహారిక, కొడుకు వరుణ్ తేజ్‌తో పాటు జబర్దస్త్ టీమ్‌లోని చాలా మంది నటులను వాడుకున్నారు.

ఆయనపోటీ చేసిన నరసాపురం పార్లమెంట్ స్థానం గురించి ఎన్నికలు అయిపోయిన తర్వాత చర్చలు జరుగుతున్నాయి. నిజానికి ఎంపీ స్థానం కోసం ముక్కోణపు పోటీ తీవ్రంగా సాగింది. ప్రధాన పోటీ వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ మధ్యనే ఉండబోతుందని అంచనా వేసినా.. దీనికి భిన్నంగా జనసేన బరిలోకి దిగడమే కాకుండా అసెంబ్లీ స్థానాల పరిధిలో వేల ఓట్లను కొల్లగొట్టినట్టు తెలిసింది. జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబుకు కొన్ని నియోజకవర్గాల్లో గంపగుత్తగా ఓట్లు లభించినట్టు అక్కడ ప్రచారం జరుగుతోంది. అయితే, టీడీపీ, వైసీపీ నుంచి బలమైన అభ్యర్థులు బరిలో నిలవడంతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ మంత్రి మాణిక్యాల రావు, ప్రజాశాంతి పార్టీ తరపున కేఏ పాల్, కాంగ్రెస్ నుంచి కనుమూరి బాపిరాజు పోటీ చేస్తుండడంతో ఈ స్థానం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గం నుంచి కీలక నేతలు పోటీ చేయడంతో ఫలితాలపై ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది.

ఇదిలాఉండగా, చాలా రోజుల తర్వాత మెగా బ్రదర్ నాగబాబు జనాల ముందుకు వచ్చారు. తాజాగా ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడిన ఆయన.. చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ‘‘చాలా రోజుల తరువాత మీతో నా అనుభవాలను పంచుకోవాలని అనిపించింది. ముఖ్యంగా ఎలక్షన్ ప్రచారంలో నాకు ఎదురైన వాటిని మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. అందుకే ఫేస్ బుక్ లైవ్‌ ద్వారా మీ ముందుకు వచ్చా. ముఖ్యంగా నేను మొన్న నరసాపురం ఎంపీగా పోటీ చేశా. రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నా. నరసాపురం ఏరియాలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల ప్రజలందరికీ ధన్యవాదాలు. గతంలో ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశారు. అయితే అప్పుడు చూపించిన ఆదరణకి ఇప్పటికీ వంద శాతం తేడా ఉంది. మెయిన్‌గా కళ్యాణ్ బాబు అంటే విపరీతంగా ఆదరిస్తున్నారు. పార్టీని జనంలోకి బాగా తీసుకువెళ్లారు’’ అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల్లో ఆయన చిరంజీవి కంటే పవన్ బెటరనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్లైంది. దీనిపై మెగా అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు.