హీరోయిన్ కు పొలిటికల్ సపోర్ట్ ఇస్తున్న మెగాస్టార్..!

June 01, 2020

దివంగత నటుడు అంబరీష్ భార్య నటి సుమలత రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే, అంబరీష్ చివరి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే ఆమె కూడా చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుండి ఆమె పోటీ చేయాలనీ భావిస్తుంది, మాండ్య నియోజకవర్గంలో జేడీఎస్ కు బలం బాగానే ఉంది. దేవే గౌడ సామజికవర్గం, అంబరీష్ సామాజికవర్గం ఒకటే కావటం వల్ల సుమలతకు కూడా అక్కడ అనుకూలత ఏర్పడే సూచనలు కనిపించటంతో కుమారస్వామి సోదరుడు రేవణ్ణ సుమలతపై అనుచిత వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.రేవణ్ణ వ్యాఖ్యల వ్యవహారం కుమార స్వామి చేత బహిరంగంగా క్షమాపణలు చెప్పించే దాకా వెళ్ళింది.

తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే, సుమలతకు లోక్ సభ సీటు ఇప్పించే విషయంలో మెగాస్టార్ చిరంజీవి లాబీయింగ్ చేస్తున్నారట. అంబరీష్ కు, చిరంజీవికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది, సుమలతతో కూడా చిరంజీవి ఎక్కువ సినిమాల్లో నటించాడు, ఈ కారణాల చేత చిరంజీవి సుమలతకు పొలిటికల్ సపోర్ట్ ఇస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. మరో పక్క చిరంజీవి రాజ్యసభ గడువు ముగిసినప్పటి నుండి కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నాడు, లోక్ సభ సీటు విషయంలో లాబీయింగ్ చేసేంత సీన్ చిరంజీవికి లేదని అంటున్నారు విశ్లేషకులు. కర్ణాటక కాంగ్రెస్ తో పాటు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ లో కూడా చర్చనీయాంశంగా మారిన సుమలత పొలిటికల్ ఎంట్రీ ఎన్ని పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.