మనం జాలిపడాల్సింది ఎవరి మీద?

August 07, 2020

ఈరోజు దేశమంతటా ఒకటే చర్చ. దినసరి కూలీల గురించి అందరూ ఆవేదన చెందుతున్నారు. అవును నిజమే వారు రోజు ఆదాయంతో బతుకుతారు. అందువల్ల ఇపుడు ఆ దినసరి ఆదాయం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ లాక్ డౌన్ కు ముందు వారి జీవనం ఒక సాధారణ ఉద్యోగి జీవితం కంటే కూడా చాలా బెటర్.

 

ఈ సాధారణ ఉద్యోగి ఎవరు? వారి జీవితం ఎలా ఉంటుంది.?

నా దృష్టిలో 15 -30 వేల మధ్య జీతం వచ్చే వారిని నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. వీరి జీవితం ఎలా ఉంటుందంటే... ఇంటి అద్దె 5-9 వేల మధ్య ఉంటుంది. వీరిలో చాలా మంది జీవిత భాగస్వాములు అర్హతల వల్లనో ఇంకోకారణం వల్లో ఉద్యోగాలు చేయడం లేదు. దీంతో సింగిల్ ఆదాయం మీద కుటుంబం మొత్తం బతుకుతుంది. ఇక వీరు సామాజిక మర్యాద కోసం ఒక మోస్తరు ఇల్లు, మోస్తరు స్కూలు, బట్టలు.. ఇలా అన్నీ సమాజం కోసం తమ తాహతును కొంచెం దాటి పొందుతూ ఉంటారు. దీనివల్ల వచ్చిన ఆదాయం మొత్తం నెలవారీ ఖర్చులకే సరిపోతుంది. దీంతో భవిష్యత్తుకు ఏ భరోసా లేకుండా జీవనం సాగిస్తారు. ఆ దేవుడి మీద భారం వేయడం తప్ప ఏం చేయలేని నిస్సహాయత. కానీ వీరికి సర్కారు నుంచి వైట్ రేషన్ కార్డు రాదు. ఉచిత ఇంటి స్థలం రాదు. 15 వేలు ఉద్యోగం దాటడం వల్ల ఈఎస్ఐ కూడా వర్తించదు. ఆరోగ్య శ్రీ వర్తించదు. గవర్నమెంటు నుంచి ఇల్లు రాదు. స్థలం రాదు. పింఛను రాదు. జీవితాంతం ఈ వర్గం బతుకు దుర్బరం. కూలీ అయినా తన కావల్సినన్ని రోజులు సెలవులు తీసుకుంటాడు. వీరికి ఆ అదృష్టం కూడా ఉండదు. ఎందుకంటే... జీతం కట్ అయ్యే లీవులు పెడితే ఇల్లు గడవదు. ఒక వేళ ధైర్యం చేసినా కంపెనీ అడిగినన్ని లీవులు ఇవ్వదు. ఈ వర్గంలో కాస్త కష్టంతో, తెలివితో ఆలోచించేవారు సపోర్ట్ ఉన్న వారు క్రమంగా తమ స్కిల్స్ పెంచుకుని ఆదాయం పెంచుకుని ముందుకు వెళ్తున్నారు. లేకుంటే ఇక ఎన్నో భారాలతో జీవితం అలా ముగుస్తుంది. అదృష్టవశాత్తూ పిల్లలు బాగా సెటిలైతే వీరికి జీవితం. లేకపోతే శూన్యం.
 
మరి దినసరి కూలీ జీవితం ఎలా ఉంటుంది. ?
కరోనా వల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్న దినసరి కూలీ సాధారణ పరిస్థితుల్లో ఎలా ఉంటారో తెలుసా? తనకు నచ్చినట్టు బతికే స్వేచ్ఛా జీవి. ఏ కూలీ ఇంట్లో అయినా కచ్చితంగా ఇద్దరు పనిచేస్తారు. భార్య, భర్త ఇద్దరు పనికి వెళ్తారు. కొందరి ఇళ్లలో పెద్ద పిల్లలు ఉంటే వారు కూడా పనిచేస్తారు. సరే పిల్లలు లేని వారినే లెక్కలోకి తీసుకుంటే... రోజుకు 700 కూలీ. ఇద్దరు కలిసి 1400 సంపాదిస్తారు. అంటే నెలకు 42000 అన్నమాట. పని శ్రద్ధగా చేసేవారికి రోజు పని దొరుకుతుంది. కానీ ఎలాంటి వారికైనా నెలకు 20 రోజుల పని గ్యారంటీగా దొరుకుతుంది. అంటే వీరి ఆదాయం 25 వేలకు తగ్గే సమస్యే లేదు. (ఇక పెద్ద పిల్లలు ఉండే కుటుంబ ఆదాయం 40 వేలకు తగ్గదు). వీళ్లకున్న వెసులు బాటు ఏంటంటే... అతి తక్కువ రెంటుకు అద్దెకు తీసుకోగలరు. సాధారణంగా వీరి అద్దె 3500 ఉంటుంది. పనికెళ్లిన చోట దొరా అని నాలుగు మాటలు చెప్పి చాయి పైసలు సంపాదించుకుంటారు. ఐదు రూపాయల భోజనం చేస్తారు. వీరి కూరగాయల ఖర్చు, ఇతర పిల్లల ఖర్చులు అన్ని రెంటుతో కలిపి నెలకు 10 వేలు కూడా దాటవు. మరి మిగతా 15 వేలు ఏం చేస్తారో తెలుసా.... వీళ్లకు బంధువులు ఎక్కువ, తాగుడు ఎక్కువ, ఒక యాభయ్యో లక్షో అప్పు ఉంటుంది. అది 5 రూపాయలు లేదా పదిరూపాయల వడ్డీ ఉంటుంది. 10 వేలతో కుటుంబం బతికితే 15 వేలు తాగుడు, వడ్డీలు, బంధువులకు సరిపోతాయి. పొరపాటున కూడా పొదుపు చేసి ఆ చిన్న అప్పు తీర్చుకుందాం భారం తగ్గుతుంది అనుకోరు. కర్మ ఏంటంటే... వీరి కుటుంబానికి గవర్నమెంట్లు పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ఉచిత రేషను, పిల్లలకు పెళ్లయితే డబ్బులు, బేబీ కిట్స్, కుల పథకాలు ఇవన్నీ ఇస్తుంది. నిజానికి చెప్పాలంటే...తెలుగు రాష్ట్రాల్లో పేదవాడు ఏ పనీ చేయకుండా బతికేసేటన్ని పథకాలున్నాయి.
 
నోట్ - ఇది ఏం తెలియకుండా రాసింది కాదు. గత ఐదారేళ్లుగా 300 మంది కూలీలతో స్వయంగా మాట్లాడిన సమాచారం ఉంది. ప్రతి ఒక్కరితో నేను స్వయంగా మాట్లాడాను వారి జీవితాల గురించి సేకరించిన సమాచారంతో రాసింది.
 
ప్రకాష్ చిమ్మల అనే ఒక నెటిజన్ ఫేస్ బుక్ నుంచి సేకరించిన పోస్టు !!