వలస కూలీల్ని విధి మరోసారి ఆడుకుందిగా?

August 12, 2020

టైం బాగోకపోతే.. టెంకాయి సైతం టైం బాంబ్ మాదిరి పేలుతుందని ఊరికే అనలేదేమో? తాజా ఉదంతాన్ని చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. దేశ వ్యాప్తంగా వలసకూలీలు ఈతి బాధల్ని చూసినోళ్లంతా అయ్యో పాపం అనుకోకుండా ఉండలేకపోతున్నారు. దేశం ఇంతగా ముందుకెళ్లినా.. వలస కూలీల కష్టాల్ని చూసిన తర్వాత మాత్రం.. దేశంలో పేదరికం పోవాలంటే మరెన్ని దశాబ్దాలు పడుతుందో అన్న బాధ కలుగక మానదు.
కరోనా వేళ సొంతూళ్లకు వెళ్లేందుకు వేలాది కిలోమీటర్ల దూరాన్ని నడకతోనే అధిగమిస్తున్న వలసలకు బ్రేక్ చెప్పేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు శ్రామిక్ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. వలసలపై విధి మరోసారి చిన్నచూపు చూసింది. శ్రామిక్ రైళ్లు నడుపుతున్నా.. అందులో ప్రయాణించే అవకాశం తమకువస్తుందో లేదో అన్న భయంతో.. ఎవరికి వారు నడకను ఆపటం లేదు. అధికారులు అవసరం లేదన్నా.. వారు మాత్రం ఊరుకోవటం లేదు.
తమ నడకలో భాగంగా రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళుతున్న వారి సంఖ్య వేలాదిగా ఉంది. ఇలాంటి వేళ.. ఊహించని ప్రమాదం ఒకటి చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో ఘటనాస్థలంలోనే పద్నాలుగు మంది మరణించారు.
కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్ పైన వలసకూలీలు నిద్రిస్తున్నారు. రోజంతా నడిచిన వారు.. ఆదమరిచి పట్టాల మీద పడుకోగా.. వేగంగా వచ్చిన గూడ్సు రైలు వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో పద్నాలుగు మంది మరణించారు. వారిలో మహిళలు..చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజా ఉదంతం గురించి విన్నంతనే వలసల్ని విధి ఆడుకుంటుందన్న భావన కలుగక మానదు.