కరోనా... దేశాన్ని ఆకర్షించిన రాజస్తాన్ ఘటన

August 07, 2020

సామాన్యుడు ఓ రూపాయికి బేరమాడొచ్చు. పేద వాడు ఆకలితో దొంగతనం చేయొచ్చు. అంత మాత్రాన వారిలో సామాజిక స్పృహ, ధర్మం అంతరించినట్టు కాదు. దీనికి రాజస్తాన్ లోని శికర్ జిల్లాలో జరిగిన ఓ ఘటన చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. వారు రోజు కూలీకి పనిచేసేవారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ తదితర ప్రాంతాలకు చెందిన కూలీలను రాజస్థాన్ లోని సికర్ జిల్లా లోని పల్సానా గ్రామంలోని పాఠశాలలో ఉంచారు.  క్వారంటైన్ లో ఉన్న వారందరికి గ్రామస్థుల సహాయంతో సర్పించ్ ఆహార సదుపాయం కల్పించారు. అయితే... ఆ స్కూలు దశాబ్దం క్రితం పెయింట్ వేయడమే. ఆ తరువాత ఇంతవరకు అస్సలు దానికి రంగువేయకపోవడంతో రంగులు పెచ్చులూడి పోయి బాగా పాడైపోయింది.

అయితే... తమను అతిథులుగా చూస్తున్న గ్రామస్థుల రుణం తీర్చుకునే ఆలోచన చేశారు. రంగులు తెచ్చిస్తే ఈ స్కూలు కు పెయింట్ వేస్తామని వారు సర్పించికి చెప్పారు. దీంతో అతను వారికి అవసరమైన రంగులు కొనిచ్చారు. వారు దానిని మొత్తం శుభ్రం చేసి చక్కగా రంగులేసి అందంగా తీర్చిదిద్దారు. పని తెలిసిన వారు ఊరక తిని కూర్చోలేదు. తామెవరో తెలియకుండా సాయం చేసిన వారికి తిరిగి ఏదైనా చేస్తే బాగుంటుంది. ఎలాగూ ఖాళీగా ఉన్నాం. రంగులేయడం వచ్చు కదా పనిచేద్దాం అని అందరూ ఒక్కతాటిపై నిలిచి పాఠశాలను సుందరంగా తయారుచేశారు. 

వారికి డబ్బులివ్వబోతే అయ్యో మమ్మల్నింతగా పోషిస్తున్నారు. మేము మీతో డబ్బు ఎలా తీసుకుంటాం అని వారు తిరస్కరించారు.  ఇది వారి సంస్కారం. ఈ సంఘటన వినడానికి ఎంత ఇంపుగా ఉంది కదా. ఒక నెటిజన్ దీన్ని ఇంటర్నెట్లో పెడితే అదిపుడు బాగా వైరల్ అవుతోంది. పలువురు వారి మనసును అభినందిస్తున్నారు. పేద వాడికి డబ్బులుండకపోవచ్చు గాని మనసు ఉంటుంది. గ్రాట్యిట్యూడ్ ఉంటుంది అని ప్రశంసిస్తున్నారు.