గవర్నరు కుమారుడికి శ్రీకాకుళంలో గనులు అప్పగింత?

June 06, 2020

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్‌పై విపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ప్రభుత్వం తొలగించి, ఆయన స్థానంలో కనగరాజ్‌ను నియమించాక కనగరాజ్ గవర్నరును కలిసి బాధ్యతలు స్వీకరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనావైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమలవుతూ ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు నిలిపివేయగా చెన్నై నుంచి కనగరాజ్ వచ్చి నేరుగా బాధ్యతలు తీసుకోవడం, గవర్నరును కలవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిని హాస్టల్ విద్యార్థులు, వలస కార్మికులనను 14 రోజులు క్వారంటీన్లో ఉంచినప్పుడు కనగరాజ్‌, ఆయన కలిసిన గవర్నరు ఇద్దరూ ఎందుకు క్వారంటీన్లో ఉండరని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు.. గవర్నరుపై పలు ఇతర ఆరోపణలూ చేస్తున్నారు. గవర్నరు కుమారుడికి శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ గనులు కూడా కేటాయించారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
ఒడిశాలోని చిల్కాకు చెందిన గవర్నరు కుటుంబం అక్కడ సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చిల్కా సమీపంలోనే ఉంటుంది. ఆ క్రమంలోనే గ్రానైట్ గనులకు పెట్టింది పేరైన శ్రీకాకుళంలో కొన్ని గనులను సొంతం చేసుకున్నారన్న ఆరోపణలను టీడీపీ వర్గాలు గుప్పిస్తున్నాయి.