మండలిలో తొడగొట్టిన మంత్రి 

August 12, 2020

ఏపీ పరిస్థితులు వర్ణించడానికి ఈ ఒక్క సీను చాలు. ఇంకేమీ అవసరం లేదు. మేము అధికారంలో ఉన్నాం... తప్పు చేసినా, ఒప్పు చేసిన మూసుకుని కూర్చోండి అన్నట్లు ఉంది వీరి వ్యవహారం. లేకపోతే ప్రజా సమస్యలు చర్చించి శాసనాలు చేయాల్సిన చోట తొడగొట్టి సవాళ్లు చేసుకోవడం ఏంటి? నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తొడకొట్టారు.

బుధవారం మండలి సమావేశం గందరగోళం అయ్యింది.  బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.   టీడీపీ సభ్యుడు నాగ జగదీశ్వర్ రావు  మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు అంశాన్ని లేవనెత్తారు. బీసీ నాయకులను అణగదొక్కుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ ఆరోపించారు. 

మధ్యలో కల్పించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ, మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్.. అచ్చెన్నాయుడు దొంగతనం చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని మంత్రి పిల్లి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టులో నిరూపణ కాకముందే మంత్రి ఈ వ్యాఖ్యలు మండలి వేదికగా చేయడం తప్పు. 

వీరి మధ్యలో దూరిన మంత్రి అనిల్ యాదవ్.. ముద్రగడ పద్మనాభం విషయాన్ని ప్రస్తావించారు. కాపు ఉద్యమ సమయంలో పెద్ద సంఖ్యలో పోలీసులతో ఆయన్ను అరెస్ట్ చేయడాన్ని ఎలా భావించాలని ప్రశ్నించారు.  

దీంతో ఆందోళనకు దిగిన  ప్రతిపక్ష టీడీపీ ఉద్యమం చేస్తున్న వారిని అరెస్టు చేయడానికి, ఇంట్లో ఆపరేషన్ చేయించుకుని బెడ్ మీదున్న వ్యక్తిని అరెస్టు చేయడానికి తేడా లేదా అని తిప్పికొట్టింది. అసలు ఆరోపణలు తప్పు. విచారణ కు నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని టీడీపీ ప్రశ్నించింది.

మంత్రి అనిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభలో తొడగొదుతూ తనను ఓడించడానికి కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపిస్తూ చర్చను మళ్లించే ప్రయత్నం చేశారు. మంత్రుల భాష, తీరుపై అంతటా చర్చ జరుగుతుందన్న ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వారి శైలిని తప్పుపట్టారు. 
ఇరుపక్షాల మధ్య వాగ్వాదం ముదరడంతో మండలి చైర్మన్ సభను వాయిదా వేశారు.