వెతకబోయిన తీగ రోజా కాలికి తగిలిందా?

February 25, 2020

వైసీపీలో కీలకమైన మహిళా నేతగా ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజాకు గుర్తింపు ఉండేది. అందుకు తగ్గట్లుగానే ప్రతిపక్షాలపై ఇష్టానుసారంగా విమర్శలు గుప్పిస్తూ తమ అధినేత జగన్ మెప్పు పొందడంలో రోజా సక్సెస్ అయ్యారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే తనకు మంత్రి పదవి దక్కుతుందని రోజా గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, రకరకాల సమీకరణాలతో రోజాకు జగన్ మొండిచేయి చూపించారు. దీంతో, ఓ దశలో అలకబూనిన రోజాకు, జగన్ కు మధ్యలో గ్యాప్ వచ్చిందని కూడా టాక్ వచ్చింది. ఎలాగోలా రోజాను బుజ్జగించి ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కట్టబెట్టిన జగన్...రెండో విడత విస్తరణలో రోజాకు మంత్రి పదవి ఇస్తానని నచ్చజెప్పడంతో ఈ వ్యవహారం బయటకు రాలేదని ప్రచారం జరిగింది. అయితే, అనూహ్యంగా రెండోసారి మంత్రి వర్గ విస్తరణకు ముందే మంత్రి పదవి దక్కేలా కనిపిస్తోంది. శాసన మండలి రద్దు నిర్ణయం రోజాకు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
మంత్రి పదవి ఆశించి, భంగపడ్డ రోజాకు మండలి రద్దు వల్ల ఆ పదవి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ కేంద్రం మండలి రద్దుకు ఆమోదం తెలిపితే....మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు పదవీచ్యులయ్యే అవకాశముంది. వారిద్దరూ రాజీనామా చేస్తారా లేదా అన్న చర్చ మొదలైంది. ఓ వైపు మండలి రద్దు చేస్తామంటూనే...తమ మంత్రులతో రాజీనామా చేయించపోతే బాగోదని వైసీపీ అధిష్టానం యోచిస్తోందట. పైగా, ఆ ఇద్దరు మంత్రులూ తమకు పదవులు ముఖ్యం కాదని సభాముఖంగా చెప్పేశారు. దీంతో, వారి రాజీనామా వ్యవహారం జగన్ కోర్టులోకి వచ్చింది. ఈ క్రమంలోనే వారు రాజీనామా చేస్తే...రోజాకు మంత్రి పదవి దక్కే చాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఏదేమైనా....జగన్ పై ఒకింత అసంతృప్తితో ఉన్న రోజాకు మండలి రద్దు ఊరటనిచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.