బిగ్ స్టోరీ- టీడీపీని ముంచింది కాపు భజనే

January 26, 2020

రెండు నిజాలు..
అత్యంత సఫల ముఖ్యమంత్రి ’చంద్రబాబు‘
అత్యంత విఫల రాజకీయ నేత ’చంద్రబాబు

ఈ రెండు వ్యాఖ్యలు చంద్రబాబు గురించే... ఇది పచ్చినిజమే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు విజయాలు లెక్కిస్తే... దేశంలో ఏముఖ్యమంత్రికి అవి సాధ్యం కాలేదు అన్నది ఎంత నిజమో... రాజకీయంగా ప్రమాదాలను ముందుగా పసిగట్టడంలో, జనాదరణ పొందే రాజకీయ వ్యూహాలను రచించడంలో అంత గొప్ప విఫలుడు చంద్రబాబు అన్నది కూడా అంతే నిజం. మరి అలాగయితే 2014లో ఎలా గెలిచాడు అని ప్రశ్నించొచ్చు. అపుడు గెలిచింది చంద్రబాబు రాజకీయ వ్యూహాల వల్ల కాదు... రాష్ట్రానికి ఒక అత్యంత సమర్థ ముఖ్యమంత్రి కావాలి కాబట్టి... చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ సమర్థత వల్ల జనం చంద్రబాబును ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. అందుకే బీజేపీ పవన్ కలిసినా ఇపుడు జగన్ కి వచ్చినటువంటి గొప్ప మెజారిటీ అప్పట్లో చంద్రబాబు సాధించలేకపోయారు.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గమనించాలి... చంద్రబాబు ఓడిపోవడం అనేది సమస్య కాదు. జగన్ చేతిలో ఓడిపోవడం... కేవలం 23 సీట్లు మాత్రమే సాధించడం అన్నది చర్చ. ఇంకా చెప్పాలంటే... రాజకీయ వ్యూహాలు రకరకాలుగా ఉండొచ్చు. కొందరు ... జగన్ అబద్ధాలు చెప్పి గెలిచారు అంటున్నారు. మరి జగన్ చెబుతున్నవి అబద్ధాలు అని ప్రజలకు వివరించడంలో చంద్రబాబు రాజకీయ చతురత చూపనట్టే కదా.

వైసీపీ ఒక పక్కా ప్లాన్ ప్రకారం ముుందుకు వెళ్తుంటే...దానిని పసిగట్టడంలో విఫలం కావడమే కాకుండా జగన్ ను చాలా తక్కువ అంచనా వేసి తెలుగుదేశం పార్టీ విఫలమైంది. బేసిగ్గా చంద్రబాబుకు జగన్ మీదున్న అభిప్రాయమే చంద్రబాబును ఇంత దారుణంగా ఓడించింది. జగన్ ప్రశాంత్ కిషోర్ ని హైర్ చేసుకున్నపుడు జగన్ లోని మార్పును గమనించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. పీకే తీసిపారేసే వ్యక్తేమీ కాదు. ప్రూవ్డ్ స్ట్రాటజిస్ట్. అలాంటి వ్యక్తిని జగన్ పక్కన పెట్టుకుంటే బాబు కనీసం జాగ్రత్త పడలేదు.
ముఖ్యంగా కులాల విషయంలో వైసీపీ వ్యూహాలు, చంద్రబాబు తప్పులు ఒకేసారి పనిచేయడం వల్ల ఇంత దారుణమైన ఫలితాలను ఇచ్చాయి. ఈ విషయం అర్థం కాక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తలపట్టుకుంటున్నారు. ‘ఐదేళ్లు ఇంత చాకిరీ చేసినా ఓడిపోవడం, మరీ ఘోరంగా 23 సీట్లే రావడం ఏమిటో అర్థం కావడం లేదు’ అన్నది బాబు బాధ.
పథకాలు.. ప్రయోజనాలు ఎన్నున్నా కూడా టీడీపీ దెబ్బయిపోవడానికి ప్రధాన కారణం కులమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ‘సోషల్‌ ఇంజనీరింగ్‌’లో టీడీపీ ఎంత విఫలమైందో వైసీపీ అంత సక్సెస్ అయ్యింది. ఈ రెండూ సమాంతరంగా జరిగాయి. అందుకే ఈ దారుణ ఓటమి అని పోలింగ్, ఫలితాలకు మధ్య సీఎస్డీఎస్-లోక్‌నీతి సర్వేలోనూ ఇదే తేలింది. 2014 ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలోని సామాజిక వర్గాల్లో వచ్చిన మార్పు వైసీపీ ఘన విజయానికి దారితీసింది.
వైసీపీ ఓట్లుగా చెప్పే రెడ్డి, మాదిగ, క్రైస్తవ వర్గాల ఓట్లను చెక్కుచెదరకుండా ఆ పార్టీ నిలబెట్టుకుంది. అదే సమయంలో టీడీపీ కమ్మ ఓట్లను నిలబెట్టుకోవడంలో ఘోరంగా విపలమైంది. రెడ్లు అంతా జగన్ వైపు ఉన్నారు. కానీ కమ్మలు అంతా చంద్రబాబు వైపు లేరు. గిరిజన నియోజకవర్గాల్లో రాంగ్ ఫీడ్ బాక్ తో టీడీపీ లాస్ అయితే... అక్కడ బాగా తిరిగి వైసీపీ పుంజుకుంది.
చంద్రబాబు చేసిన అతిపెద్ద ఘోర తప్పిదం ... కాపులను దువ్వడం. ఒకవైపు పవన్ వేరు పడ్డాడు. అక్కడే చాలా కాపు ఓట్లు పోయాయి. మరోవైపు జగన్ వైపు పెద్ద సంఖ్యలో కాపు నేతలు చేరారు. అక్కడా కొన్ని ఓట్లు చీలాయి. ఇక ఉద్యమ నేతలు అని చెప్పుకునే ముద్రగడ వంటి వారు చంద్రబాబు కాపులకు ఎన్ని చేసినా... బాబును డామేజ్ చేస్తూ వచ్చారు. ఇన్ని రకాలుగా కాపు ఓట్లు తన చేతిలోంచి జారిపోతున్న సమయంలో  ప్రత్యేకంగా కేంద్రం ఇచ్చిన అగ్రవర్ణ రిజర్వేషన్లలో 5 శాతం ప్రత్యేకంగా చీల్చడం కాపుల కోసం చీల్చడం కమ్మలకు కూడా కోపం తెప్పించింది. మరోవైపు 150 కులాలున్న బీసీలకు కోపం తెప్పించేలా చంద్రబాబు కాపు కులం భజన శృతిమించి చేశాడు.
125 రూపాయలు పెంచి వైఎస్ కు దక్కిన క్రెడిట్ 1800 పెంచిన చంద్రబాబుకు దక్కలేదు. దీనికి సరైన విధానం సందర్భం చంద్రబాబు పాటించకపోవడమే కారణం. అనేక కులరాజకీయ విఫల వ్యూహాలతో జనం వైసీపీ వైపు తిరిగాక పెద్ద ఎత్తున ప్రకటించిన పథకాలు చంద్రబాబుకు అనుకూలంగా ఓటింగ్ ను ప్రభావితం చేయలేకపోయాయి. చంద్రబాబే ఈ స్థాయిలో ఇస్తే జగన్ దీనికంటే ఇంకా ఎక్కువే ఇస్తారంటూ వైసీపీ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. దీంతో చంద్రబాబు ఇచ్చిన తాయిలాల కంటే జగన్ ఇవ్వబోయే తాయిలాలే ఓటర్లను బాగా ఆకర్షించాయి.

పల్లెల్లో పతనం
ముఖ్యంగా గ్రామాల్లో వైసీపీ యువతను రెచ్చగొట్టడం ద్వారా, టీడీపీ నేతలను బ్లేమ్ చేయడం అందరికీ దగ్గరయ్యింది. ఆ గ్యాప్‌ను టీడీపీ పట్టణాల్లో కవర్ చేసుకోలేకపోవడం గమనార్హం. గ్రామాల్లో వైసీపీకి 56 శాతం ఓట్లు రాగా.. టీడీపీకి 37 శాతం ఓట్లొచ్చాయి. పట్టణాల్లో టీడీపీకి 44 శాతం, వైసీపీకి 35 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, గ్రామీణ ప్రాంతమే రాష్ట్రంలో ఎక్కువ కాబట్టి... సహజంగానే గెలుపు వైసీపీకి దక్కింది. కాపులపై చంద్రబాబు చూపిన ప్రేమ బీసీలకు మంట పుట్టించింది. బీసీలు కోపంగా ఉన్నారు అని అర్థం చేసుకున్న జగన్ అదేసమయంలో జగన్ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వను అని, అది నా పరిధిలో లేదు అదే పనిగా బహిరంగ ప్రకటన చేశాడు. దీంతో బీసీలు జగన్ వైపు చూశారు. బీసీ ఓట్లు అత్యధికంగా పల్లెల్లోనే ఉంటాయి. ఆ ఓట్లను కొల్లగొట్టడం వల్లే జగన్ ఈ స్థాయిలో సక్సెస్ అయ్యారు.