​అన్నీ బంద్ - డాక్టరుగా మారిన ఎమ్మెల్యే

June 04, 2020

పరిస్థితులకు అనుగుణంగా స్పందించే నాయకులను ప్రజలు ఎపుడూ ఇష్టపడతారు. తాజాగా తెలంగాణలో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి... ఒక ఎమ్మెల్యే డాక్టరుగా మారి వైద్య సేవ చేశారు. ఆయన తక్షణ స్పందనకు బాధిత కుటుంబమే కాదు గ్రామప్రజలు కూడా సంతోషపడ్డారు.  ​ఈ సంఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలం, టేకుల పల్లి గ్రామంలో జరిగింది.

టేకులపల్లి గ్రామవాసి అయిన సుధారాణి 9 నెలల గర్భవతి. ఆమెకు నొప్పులు వచ్చాయి. అన్ని రవాణా సర్వీసులు బంద్. వారికి ఏం చేయాలో పాలుపోలేదు. ఎమర్జెన్సీ నెంబరు 100 కు ఫోన్ చేశారు. వారి నుంచి తక్షణ స్పందన వచ్చింది. అంబులెన్సు పంపారు. అయితే అప్పటికి సర్పంచి ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అక్కడికి చేరుకున్నారు. ఆయన స్వయంగా వైద్యుడు. వెంటనే అంబులెన్సులో ఉన్న పరికరాలతో ఆమెను పరీక్షించారు. ఆమె పెద్ద ప్రమాదం లేదు. ఇవి కాన్పు నొప్పులేం కావు. రక్తహీనత ఉందని వివరించారు. కాన్పు 20 రోజుల తర్వాత అవుతుందని పరీక్షించి చెప్పారు. అవసరమైన మందులు రాసిచ్చారు. 

కంగారు పడాల్సిన అవసరం లేదని, నొప్పులు వస్తే తనకు కాల్ చేయాలని నెంబరు ఇచ్చారు. ఎమ్మెల్యే తక్షణ స్పందనను గ్రామస్థులు మెచ్చుకున్నారు. ఆమెకు పర్వాలేదని తేలడంతో అంబులెన్సును పంపించేశారు.