ఇదే ఏపీ కర్మ: కలెక్టరుకు ఎమ్మెల్యే వార్నింగ్

August 06, 2020

ఎంతో ఉన్నత చదువులు చదివి, తెలివితేటల్లో, సామాజిక అవగాహనలో అగ్రగణ్యులను అత్యంత క్లిష్టమైన రెండు సంవత్సరాల ప్రాసెస్ ద్వారా ఎన్నుకుని, ఏడాది పాటు శిక్షణ ఇచ్చాక... ఉద్యోగంలో చేరితే అక్కడ పలు చోట్ల చిన్న పోస్టుల్లో పనిచేసి ప్రాక్టికల్ అనుభవం, పాలన జ్జానం సంపాదించాక ఒక వ్యక్తి కలెక్టరు అవుతారు. 

ఒకప్పుడు ఏమోగాని... నేటి రోజుల్లో ఒక నాయకుడిని గుడ్డిగా సమర్థించి వారి అడుగులకు మడుగులొత్తి, వారు చెప్పిందే వేదమని నమ్మి, ప్రత్యర్థిని బూతులు తిట్టి, ఓటర్లపై కనకవర్షం కురిపించగలిగిన వారు ప్రజాప్రతినిధులు అవుతున్నారు. 

ఈ రెండూ చదివాక ఇద్దరికీ తేడా ఏంటో ఎవరికైనా ఇట్టే అర్థమవుతోంది. నెల్లూరు జిల్లాలో ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఒక ఎమ్మెల్యే జిల్లా కలెక్టరుకు, ఎస్పీకు మీడియా ముఖంగా వార్నింగ్ ఇచ్చాడు. ఆయన ఎవరో కాదు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఒక ఎమ్మెల్యే స్థాయితో పోల్చుకుంటే కలెక్టరు స్థాయి పెద్దది. స్థాయిలతో సంబంధం లేకుండా చూసినా.. ఒక ఉన్నత హోదాను తక్కువ చేసి మాట్లాడటం అన్నది సమాజానికి మంచిది కాదు. పోనీ ఆ కలెక్టరు ఏమైనా తప్పు చేశాడా అంటే  అదీ లేదు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు పెడితే సమర్థించాడు. అది ఆయన బాధ్యత. కానీ అధికార పార్టీ వాళ్లనే అడ్డుకుంటావా? నీకెంత ధైర్యం అంటున్నారు ఎమ్మెల్యే. 

ఇంతకీ ఈ పెద్ద మనిషి ఏం చేశాడో తెలుసా... తాను చేసే సాయం పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు రాల్చాలని 4 వేల మందిని ఒకేచోటకు పిలిపించి పెద్ద సమావేశంలా పెట్టి సరుకులు పంచారు. ఎక్కడా సామాజిక దూరం గాని, మాస్కులు ధరించడం గాని చేయలేదు. ఇది కరోనా వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదకరమైన చర్య. లాక్ డౌన్ రూల్స్ ప్రకారం ఆయనపై కేసు పెట్టారు. దీంతో కోపమొచ్చి నామీదే కేసు పెడతారా అంటూ పోలీస్ స్టేషను ముందు ధర్నా చేశారు. అంటే పోలీసులు అధికార పార్టీ వారు ఏం చేసిన మూసుకుని కూర్చోవాలని సందేశం పంపించడానికి  ఆ ధర్నా. తనపై కేసు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆయనపై కేసు ఎత్తేయొద్దు అంటూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

దీంతో కలెక్టరు, ఎస్పీలపై నల్లపురెడ్డికి కోపం వచ్చింది. నా కార్యక్రమంలో పాల్గొన్న ఒక్క అధికారిని బదిలీ చేసినా ఊరుకునేది లేదని బెదిరించారు. పోలీసులు, వలంటీర్లు, రెవెన్యూ సిబ్బంది ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్విర్తిస్తుంటే... మీరు ఏసీ రూముల్లో కూర్చుంటారా? అని నిలదీస్తున్నారు ఈ పెద్దమనిసి. కలెక్టరు పని అధికార యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపించడం, వలంటీరు పని కలెక్టరు చేస్తే కలెక్టరు పని ఎవరు చేస్తారో నల్లపురెడ్డే చెప్పాలి. 

ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఐఏఎస్, ఐపీఎస్ లకే వార్నింగ్ లు ఇస్తుంటే ఇక అధికార యంత్రాంగం ఒకతాటిపై ఎలా నడుస్తుంది. అధికార పార్టీ చెప్పినట్లు ఆడటానికి, వారి తప్పులు చూసీ చూడటన్లు వదిలేయడానికి ఇక కలెక్టర్లు ఎందుకు? అయినా ఏకంగా కలెక్టరుకే వార్నింగ్ ఇచ్చాడంటే... ఇక సామాన్యులను, ప్రతిపక్షాలను అయితే బెదిరింపులు ఉండవు, డైరెక్టుగా యాక్షనే ఏమో. ఇలాంటి వారు చేసే అరాచకాలను చూస్తూ ఊరికే ఉన్న ముఖ్యమంత్రి జగన్ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? 

కొసమెరుపు ఏంటంటే... నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారు అని అధికారులకు నోటీసులు ఇస్తే వారు వెళ్లి ఎమ్మెల్యే ని పిలుచుకుని వచ్చి మీడియా ముందు కలెక్టరుకు ఎమ్మెల్యే వార్నింగ్ ఇస్తుంటే కలెక్టరుదే తప్పు అంటూ తలూపుతున్నారు. ఎంత బరి తెగింపు ఇది? !!!