అవును.. అనసూయను పోలీసులు అడ్డుకున్నారు

June 02, 2020

ఎవరికి వారు ఇళ్లల్లో ఉండిపోయిన వేళ.. పేదోళ్ల బతుకులు ఎంత ఇబ్బందికరంగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వ్యవస్థలన్ని స్తంభించిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి లేక.. బడుగుజీవులకు జరుగుబాటు కష్టంగా మారింది.

ఇలాంటి సమయాల్లో ముందుకొచ్చే ప్రజాప్రతినిధులు పలువురు ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు మినహా చాలామంది ఎవరికి వారు అన్నట్లుగా ఉండిపోయారు. ఇలాంటివేళ ములుగు ఎమ్మెల్యే.. కాంగ్రెస్ నేత ధనసరి అనసూయ అలియాస్ సీతక్క మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇవాల్టి రోజుల్లో మరే ఎమ్మెల్యేను చూడని రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారు.
తానే స్వయంగా మూటలు మోసుకుంటూ నిత్యవసర వస్తువుల్ని ఏజెన్సీ ప్రాంతాల్లో పంపిణీ చేస్తూ.. గిరిజనులకు దన్నుగా నిలుస్తున్నారు. వాగులు.. వంకలు ఎక్కి దిగుతూ.. తీవ్రమైన శ్రమకు వెనుకాడక.. ముప్పును పట్టించుకోకుండా ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తెలంగాణ అధికారపక్షానికి చెందిన పలువురు నేతలు సీతక్క దెబ్బకు డిఫెన్సులో పడిపోయిన పరిస్థితి.
గిరిజనుల బాగోగుల్ని చూస్తున్న సీతక్కపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఏజెన్సీ ప్రాంతమైన రేగళ్ల గ్రామంలో నిత్యవసర వస్తువుల్ని పంపిణీ చేసేందుకు బయలుదేరారు. టేకులపల్లి మీదుగా వస్తున్న ఆమెను రేగళ్ల క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు ఆపేశారు.
ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు ఆపటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. అయితే.. అందుకు కారణం వేరే ఉందంటున్నారు. ఆమె ప్రయాణిస్తున్న ప్రాంతంలో మావోల కదలికలు ఎక్కువగా ఉన్నాయని.. ఆమె భద్రత కోసమే తామీ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. నిత్యవసర వస్తువుల్ని పంపిణీ చేయటానికి అనుమతి లేదని చెబుతున్నారు.

తన తీరుతో వార్తల్లో నిలుస్తున్న సీతక్కను కావాలనే పోలీసులు అడ్డుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తనను ఆపిన పోలీసుల తీరుపై సీతక్క స్పందించలేదు. ఆమె నోటి నుంచి వచ్చే మాటలతో.. ఈ ఇష్యూపై కొంతమేర క్లారిటీ వచ్చే వీలుంది.