జగన్ హీరో కావాలంటే... ఎమ్మెల్యేలు జీరోలు కావాల్సిందేగా

June 03, 2020

ఏపీలో అధికార పార్టీగా మారిన వైసీపీలో ఓ విచిత్రమైన వ్యవహారం సాగుతోంది. పార్టీ విపక్షంలో ఉండగా... పార్టీకి వెన్నుదన్నులా నిలవడంతో పాటుగా పార్టీ కేడర్ ను కాపాడుకుంటూ వచ్చిన నేతలు... ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మారిన తర్వాత ఎన్నడూ లేనంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారట. అవినీతి నిర్మూలన అంటూ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఎమ్మెల్యేలను అస్సలు దగ్గరకు రానివ్వడం లేదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా తెర మీదకు వచ్చిన వలంటీర్లకు దక్కుతున్న గౌరవం కూడా ఎమ్మెల్యేలకు దక్కడం లేదన్న వాదనలు కలకలం రేపుతున్నాయి. అయినా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి, జగన్ కు కవచంలా నిలిచిన వారికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయంపై ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారంతా తమ తమ శాఖల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్తితుల్లో ఉన్నారు. ఏ శాఖలో అయినా, ఏ నిర్ణయమైనా జగనే స్వయంగా తీసుకుంటున్న నేపథ్యంలో మంత్రులంతా ఉత్సవ విగ్రహాల మాదిరిగా మారిపోయారు. అయితే ఎమ్మెల్యేల హోదాలో అయినా తమ నియోజకవర్గాల్లో ఏదైనా చేద్దామని భావిస్తున్న మంత్రులకు... ఎమ్మెల్యేల హోదాల్లో కూడా జగన్ చేతులు కట్టేస్తున్న వైనంపై మింగలేక కక్కలేక ఈసురోమంటున్నారట. మంత్రుల పరిస్థితే ఇలా ఉంటే... ఇక ఎమ్మెల్యేల పరిస్థితి ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. నియోజకవర్గాల్లో ఏ పని కావాలన్నా కూడా ప్రజలు ఎమ్మెల్యేలను ఆశ్రయించడానికి బదులుగా కొత్తగా తెరపైకి వచ్చిన గ్రామ సచివాలయాల్లో తిష్ట వేసిన వలంటీర్ల వద్దకే వెళుతున్నారట. ఇక పనుల విషయంలోనూ ఎమ్మెల్యేలు ఏమీ చేయలేని స్థితిలో పడిపోయారట. 

అయినా ఇదంతా ఎందుకన్న విషయంపై ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. జగన్ తనను తాను ఓ హీరోగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు కదా. మరి తాను హీరోగా కనబడాలంటే... తన పక్కన ఉండే ఎమ్మెల్యేలను జీరోలను చేస్తేనే కదా తన ప్లాన్ వర్కవుట్ అవుతుందన్నది జగన్ భావనగా తెలుస్తోంది. అంటే తనను తాను ఎలివేట్ చేసుకునేందుకు జగన్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేలను జీరోలుగా చేస్తున్నారట. పోనీ జీరోలుగా పరిగణిస్తున్న ఎమ్మెల్యేలను జగన్ అలా వదిలేస్తున్నారా? అంటే... అదీ లేదు. వలంటీర్లు చేసే పనుల కంటే కూడా మరింత పనులను ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్న జగన్... తాను అప్పజెప్పిన పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యేలు భావించేలా చేస్తున్నారట. ఈ తరహా పరిస్థితి వైసీపీలో అంతకంతకూ పెరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే తీరు మున్ముందు కొనసాగితే... వచ్చే ఎన్నికల్లో తాము నిలిచి గెలిచేదెలా అని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.