సాయిరెడ్డికి షా క్లాస్... అనుభవ రాహిత్యమంటే ఇదే

February 25, 2020

నిత్యం ట్విట్టర్ లో యమా యాక్టివ్ గా ఉండే వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి... తనకు అంతా తెలుసు అన్నట్లుగానే వ్యవహరిస్తారు. అయితే తనకు ఏమాత్రం తెలుసో... రాజకీయాల్లో తలలు పండిన నేతలు ఇట్టే చెప్పేస్తున్న వైనం కూడా మనకు తెలిసిందే. అయితే సాయిరెడ్డి తనకు అనుభవం లేదని తనకు తానే చెప్పేసుకుని, అడ్డంగా బుక్కైన వైనం ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. అనుభవ రాహిత్యంతో తనదైన శైలిలో చక్రం తిప్పేందుకు యత్నించిన సాయిరెడ్డికి... బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి నిండా తలంటేశారు. అది కూడా ఎక్కడో క్లోజ్డ్ డోర్ లో కాదు.. పార్లమెంటులో ప్రాతినిథ్యం ఉన్న అన్ని పార్టీలకు చెందిన ప్రతినిధుల ముందే అమిత్ షా తలంటడంతో సాయిరెడ్డి నిజంగానే ముఖం మాడిపోయిందట.

 

ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే... సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీకి అధికార బీజేపీ సహా పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న దాదాపుగా అన్ని పార్టీలూ హాజరయ్యారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత హోదాలో విజయసాయిరెడ్డి... లోక్ సభలో తమ పార్టీ నేత పెద్దిరెద్ది మిథున్ రెడ్డిని వెంటబెట్టుకుని మరీ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం బెయిల్, జైలు జీవితానికి సంబంధించి హస్తం పార్టీ నేతలు ప్రస్తావించారట. 

 

అంతే...ఒక్కసారిగా గొంతు సవరించుకున్న సాయిరెడ్డి... తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కేసుల విషయాన్ని ప్రస్తావించారట. దీంతో చిర్రెత్తుకొచ్చిన అమిత్ షా... ఎక్కడేం మాట్లాడాలో తెలియదా? అంటూ సాయిరెడ్డికి ఝలక్ ఇచ్చారట. అయినా మీ జగన్ రెడ్డి ఇప్పుడు ఎంపీ కాదు కదా... ఎంపీ కాని వ్యక్తి గురించి ఇక్కడ ప్రస్తావించడం ఎందుకు? వ్యవహారం తెలియదా? తెలియకపోతే... తెలియనట్లు ఉండాలి కదా.. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకుంటే ఎలా? అంటూ అమిత్ షా చెడామడా లెంపలు వాయించినంత పనిచేశారట. ఇదే అదనుగా హస్తం పార్టీ నేతలు కూడా సాయిరెడ్డి మీద గయ్యిమన్నారట. చిదంబరానికి, జగన్ కు సంబంధం ఏమిటని వారు కూడా ఓ రేంజిలో నిలదీయడంతో సాయిరెడ్డి తలదించేసుకోక తప్పలేదట.