మోడీ కి ఆ ఒక్కటీ సాధ్యం కాలేదే!!

July 04, 2020

తాను ఇండియా సూపర్ హీరో అని ఫీలయిన ప్రధాని నరేంద్ర మోడీకి పెద్ద ఝలకే తగిలింది. ఎన్నికల సంఘం నిర్ణయంతో వాయిదాపడి భారీ అంచనాలతో విడుదల అయిన ‘పీఎం నరేంద్రమోడీ‘ సినిమా విడుదల అయ్యింది. డిజాస్టర్ కూడా అయ్యింది.
మోడీని ఏకంగా ప్రధాని చేయాలని ఓటేసిన వారిలో పది శాతం మంది కూడా ఈ సినిమా చూసినట్లు లేరని కలెక్షన్లను బట్టి అర్థమవుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో ఓటడిగితే వేస్తాం గాని డబ్బులు పెట్టి నీ డబ్బా వినమంటే... మాకు టైం లేదుపో అని జనం దాన్ని తీసి పక్కనపడేశారు. పవర్ ఫుల్ పీఎంగా ఎంపికయిన వారంలోపే ఈ సినిమా విడుదల అయ్యి డిజాస్టర్ టాక్ రావడం మోడీని డిజప్పాయింట్ చేసినట్టుంది.
మోడీ జీవిత కథ ఆధారంగా ‘పీఎం నరేంద్ర మోడీ’ పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. గత వారమే ఈ చిత్రం విడుదల అయ్యింది. తొలి వారంలో ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ దేశవ్యాప్తంగా కేవలం రూ.16 కోట్లు. వివేక్ ఒబెరాయ్ వంటి పేరున్న హీరో, ఒమంగ్ కుమార్ లాంటి మంచి దర్శకుడు కలిసి చేశారు. కథాంశం మొన్నే సూపర్ హిట్ అయిన మోడీ. కానీ ఇవేవీ ఆ సినిమాను కాపాడలేదు.
వాస్తవానికి ఈ సినిమా మొదలైనపుడే ఇది ఆడే బొమ్మ కాదని అందరికీ తెలుసు. ట్రైలర్ లోనే మోడీ భజన కనిపించింది. సినిమా మొత్తం చూసినా అభిప్రాయం మారలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే... మోడీ ఫ్యాన్స్ కు కూడా బోర్ కొట్టించిన బొమ్మ ఇది. ఇంత ఘన విజయం సాధించిన మోడీకి ఆ ఒక్క సినిమాను హిట్ చేసుకోలేకపోవడం సెట్ బ్యాక్ అనుకోవాలా? అందరూ అన్నింట్లో హిట్ కాలేరు అనుకోవాలా?