ఇప్పటివరకూ ఏ ప్రధాని చేయని పని చేసిన మోడీ

August 07, 2020

మాటలు చెప్పటం వేరు. చేతుల్లో చేసి చూపించటం వేరు. ఎన్ని నీతులు చెప్పినా అవన్నీ మాటల వరకే. అందునా దేశ ప్రధాని లాంటి కుర్చీలో కూర్చున్న వేళ.. ఊహించని రీతిలో వ్యవహరించటం ప్రధాని మోడీకి మాత్రమే సాధ్యమవుతుందేమో. 72 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటివరకు దేశ ప్రధానులుగా వ్యవహరించిన వారిలో ఎవరూ వ్యవహరించిన తీరును ప్రదర్శించి భారతావనినే కాదు.. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తేలా చేశారు మోడీ.
ప్రస్తుతం చైనా అధ్యక్షుడు భారత్ లో పర్యటిస్తున్న వేళ.. ఆయన ఉన్న తమిళనాడులోనే ప్రధాని మోడీ ఉన్న సంగతి తెలిసిందే. తాను బస చేసిన హోటల్ కు దగ్గర్లోని మామల్లపురం బీచ్ ను ఈ ఉదయం వెళ్లిన ఆయన.. సముద్రం ఒడ్డున ఉన్న చెత్తను స్వయంగా ఎత్తారు. చేతితో ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ పట్టుకొని.. నడుచుకుంటూ బీచ్ లో తన కంటికి కనిపించిన చెత్తను తానే స్వయంగా తీసి బ్యాగులో వేసుకుంటూ ముందుకెళ్లారు.
ఈ క్రమంలో తాగి పారేసిన ప్లాస్టిక్ కప్పులు.. ప్లేట్లు.. విరిగిపోవటంలో అక్కడే వదిలేసిన చెప్పులతో సహా.. చెత్తను క్లీన్ చేసే విషయంలో తనకున్న కమిట్ మెంట్ ఎంతన్న విషయాన్ని ఆయన తన చేతలతో చేసి చూపించారు. తాను చేసిన పనికి సంబంధించిన మూడు నిమిషాల రెండు సెకన్ల ఉన్న వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
అరగంట పాటు బీచ్ లో తాను చెత్త సేకరించానని.. దాన్ని తాను బస చేసిన హోటల్ సిబ్బందిలో ఒకరైన జయరాజ్ కు హ్యాండోవర్ చేసినట్లుగా పేర్కొన్నారు. నిరాడంబరానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. మోడీ చేసిన పనికి లక్షల్లో లైకులు కొడుతున్నారు. మీరు గ్రేట్ సార్ అన్న వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఎప్పుడేం చేయాలో అది చేయటం ద్వారా.. ప్రజల మనసుల్ని దోచుకునే విషయంలో మాత్రం మోడీకి మించిన మొనగాడు మరొకరు ఉండరనే చెప్పాలి.