ఇందిరాగాంధీ పై మోడీ భారీ డైలాగ్

June 01, 2020

మాటల రాయుడు మోడీ ఈసారి తన క్రియేటివిటీని ఇందిరాగాంధీని విమర్శించడానికి ఉపయోగించారు. ఇందిర ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ దుర్దినాలకు ఈరోజుతో 44 సంవత్సరాలు పూర్తయ్యాయి. అప్పట్లో దాదాపు రెండేళ్లు దేశంలో అత్యవసర పరిస్థితి కొనసాగింది.
దీనిపై ఈరోజు మోడీ మాట్లాడారు. ‘‘ఒకరు (ఇందిరను ఉద్దేశిస్తూ) తమ పదవిని కాపాడుకోవడానికి దేశ ఆత్మను చూర్ణం చేశారు. మీడియా నిజాలు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. నేతలను రహస్య ప్రదేశాలకు తరలించారు. ఎమర్జెన్నీ రెండేళ్లలో జరిగిన అరాచకాలు, అన్యాయాలను ప్రజలకు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆనాటి చీకటి రోజులు ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఇదంతా కేవలం పదవి కోసం చేశారు‘‘ అంటూ మోడీ మండిపడ్డారు. ఈ ఘోరాలు కాంగ్రెస్ పాలన ఘనత కాదా? ఇది చెప్పకుండా... మా హయాంలో అది చేశాం, ఇది చేశామని జబ్బలు చరుచుకుంటారా అని మోడీ విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన సంక్షేమ పనులపై ఆ పార్టీ నేత అదిర్ రంజన్ చౌదరి నిన్న సుదీర్ఘంగా ప్రసంగించారు. దానికి సమాధానంగా మోడీ ఈ విమర్శలు చేశారు.
అయితే, మోడీ కాంగ్రెస్ తన మసకబారిన చరిత్రను చెప్పలేదు అనడానికి ముందు గుజరాత్ అల్లర్ల గురించి ఎందుకు చెప్పుకోవడం లేదో వివరణ ఇవ్వాలని నెటిజన్లు మోడీని ప్రశ్నిస్తున్నారు. అయ్యా ఎదుటి వాళ్ల చీకటి, మీచీకటి రెండూ ప్రజలకు తెలుసులే అని మోడీపై చురకలు వేస్తున్నారు నెటిజన్లు.