మోదీ మార్కు చర్య... జగన్ ఇష్టారాజ్యం ఇక చెల్లదంతే

February 24, 2020

నవ్యాంధ్రప్రదేశ్ కు కొత్తగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలి పాలనకు శ్రీకారం చుట్టారు. ఈ తనదైన శైలి పాలనతో జగన్ రాష్ట్రానికి లాభం చేయడానికి బదులుగా తీరని అన్యాయం చేస్తున్నారన్న వాదనలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. పీపీఏల పున:సమీక్ష, పనుల్లో రివర్స్ టెండరింగ్ తదితర కార్యకలాపాలతో పెట్టుబడిదారులను జగన్ సర్కారు బెంబేలెత్తిస్తోంది. ఈ తరహా జగన్ వైఖరి ఒక్క ఏపీకే కాకుండా యావత్తు దేశానికి కూడా తీరని నష్టం చేస్తోందన్న వాదనలు కూడా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. జగన్ ను ఇలాగే విడిచినపెడితే... ఏపీ సంగతి అలా పక్కనపెడితే... దేశంలోని ఏ ఒక్క రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి పెట్టుబడి సంస్థలు గుడ్ బై చెప్పడం ఖాయమేనని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఓ అంచనాకు వచ్చింది. అంతే... ఈ తరహా విపరిణామాలను చూస్తూ ఊరుకునేది లేదని, ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిందేనని తీర్మానించడంతో పాటుగా వెనువెంటనే రంగంలోకి దిగిపోయింది. 

 

ఇందులో భాగంగా కేంద్ర విదేశాంగ శాఖ తాజాగా 15వ ఆర్థిక సంఘానికి ఓ కీలక లేఖను రాసింది. ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థలు పెట్టిన పెట్టుబడులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారీతిన రద్దు చేసుకోకుండా చూడాలని, ఇందుకోసం ఓ ప్రత్యేక నిబంధనను రూపొందించాలని కూడా ఆ లేఖలో కోరిందట. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ఆయా దేశాలకు చెందిన పెట్టుబడి సంస్థలతో సంప్రదింపులు జరపడం, ఆయా దేశాలతో భారత్ కు సత్సంబందాలు నెలకొల్పడమే లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్ర విదేశాంగ శాఖ రాసిన ఈ లేఖకు 15 ఆర్థిక సంఘం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం ఖాయమే. అంతేకాకుండా కేంద్రం నుంచి వచ్చిన ఈ వినతిని ఆర్థిక సంఘం తోసిపుచ్చే అవకాశాలు కూడా లేవన్న వాదన వినిపిస్తోంది. అంటే... కేంద్రం పంపిన ఈ ప్రతిపాదన మేరకు విదేశీ పెట్టుబడులను ఇష్టారీతిన రద్దు చేసుకునే విషయంలో రాష్ట్రాలకు ముకుతాడు వేసేలా ఆర్థిక సంఘం నిబంధనలను కఠినతరం చేయడం కూడా ఖాయమే. 

 

ఇదే జరిగితే... టీడీపీ హయాంలోనో, అంతకంటే ముందుగానో ఏపీ ప్రభుత్వంతో విదేశీ పెట్టుబడిదారులు కుదుర్చుకున్న ఒప్పందాలను జగన్ సర్కారు రద్దు చేయడమో, పున:సమీక్షించడమో సాధ్యం కాదు. అంతేకాకుండా రాష్ట్రానికి భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు రాకుండాపోయే ప్రమాదం కూడా ఉండబోదన్న మాట. మొత్తంగా జగన్ కు ముకుతాడు వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం... ఆర్ధిక సంఘానికి చేసిన ప్రతిపాదన ఇప్పుడు అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రతిపాదన నిబంధనగా రూపొందితే జగన్... తన ఇష్టారాజ్యాన్ని పక్కనపెట్టేసి బుద్దిగా, రాజ్యాంగబద్ధంగా పనిచేసుకోక తప్పదన్నమాట.