మోదీ నోట కేసీఆర్ హడలిపోయే మాట

August 07, 2020

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంద్న విషయంలో ఇంతవరకు ఊహాగానాలే తప్ప స్పష్టత లేని సమయంలో ప్రధాని మోదీ నోటి నుంచి వచ్చిన ఓ మాట ఇప్పుడు తెలంగాణలోని పాలక టీఆరెస్‌కు, సీఎం కేసీఆర్‌కు షాకిచ్చింది. ఇంతవరకు తెలంగాణ బీజేపీ నేతలే తప్ప కేంద్రంలోని బీజేపీ పెద్దల నోటి నుంచి వినని ఆ మాట ఈ రోజు నేరుగా మోదీ నోటి నుంచి రావడంతో వేడి మొదలైంది. ఆ మాట.... ‘‘వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో విజయం మనదే’’.
అవును... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణ బీజేపీ నేతలతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామన్నారు. మోదీతో భాజపా తెలంగాణ ఎంపీలు ఈ రోజు పార్లమెంట్‌ ప్రాంగణంలో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు, తెలంగాణ ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, సోయం బాపురావు, అర్వింద్‌, బండి సంజయ్‌ తదితరులు మోదీని కలిసిన వారిలో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. కష్టపడి పని చేయాలని బీజేపీ నేతలకు సూచించారు. తెలంగాణలో పరిస్థితులను మోదీ అడిగి తెలుసుకున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు బీజేపీ ఎంపీలతో మోదీ మాట్లాడారు.
కాగా మోదీ, అమిత్ షాలు ఏ రాష్ట్రం గురించైనా ప్రత్యేకంగా మాట్లాడుతూ అక్కడ అధికారంలోకి వస్తామని చెబితే అక్కడ ఫోకస్ పెంచడం.. గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేయడం తెలిసిందే. దీంతో తెలంగాణను బీజేపీ టార్గెట్ చేయడం పక్కా అని తేలిపోయింది. సాక్షాత్తు మోదీయే ఆ మాట చెప్పడంతో తెలంగాణలోని పాలక టీఆరెస్ పార్టీలో దీనిపై చర్చ మొదలైంది. ఇంతకాలం బీజేపీ నేతలు ఈ మాట చెబుతున్నా లైట్‌గా తీసుకున్నా ఇప్పుడు మోదీ కూడా చెప్పడంతో లైట్‌గా తీసుకోవడానికి లేదని టీఆరెస్ నేతలు అంటున్నారు.