హ్యూస్టన్‌లో మోదీ మెనూ.. వింటుంటూనే నోరూరిపోతోంది

August 06, 2020

భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. వారం రోజుల పర్యటన నిమిత్తం అమెరికాలోని హ్యూస్టన్ లో కాలుమోపిన మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11 గంటల సమయంలో హ్యూస్టన్ లోని జార్జ్ బుష్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు మోదీ చేరుకోగా, ప్రొటోకాల్ అధికారులు, పలువురు ప్రవాస భారతీయ ప్రముఖులు, ప్రజలు స్వాగతం పలికారు.
ఈ రోజు హ్యూస్టన్‌లోని భారీ మైదానంలో 'హౌడీ మోదీ' కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దాదాపు 50 వేల మంది హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం మోదీ ప్రసంగాన్ని వినేందుకు ఉవ్విళ్లూరుతున్నట్టు ప్రకటించారు. ఆయన కూడా సమావేశానికి రానున్నారు. కాగా, నేడు మోదీ, 18 చమురు కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో సమావేశం కానున్నారు.
ఇక అమెరికాలో మోదీకి విందు ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. ఆయన కోసం ప్రత్యేక వంటకాలు సిద్ధం చేస్తున్నారు. హ్యూస్టన్ కు చెందిన ప్రముఖ భారతీయ చెఫ్‌ కిరణ్‌ వర్మ, ఆయనకు పసందైన వంటకాలను వండి, వడ్డించేందుకు సిద్ధమయ్యారు. మోదీ కోసం ప్రత్యేకంగా నోరూరించే వంటకాలు సిద్ధమవుతున్నాయి. ఇవన్నీ స్వచ్ఛమైన భారత దేశీయ నెయ్యితో తయారవుతున్నాయి. రెండు రకాల నమో తాలి, నమో తాలి మిఠాయి ఇందులో స్పెషల్. ఇక మిఠాయిల్లో భాగంగా రస్‌ మలాయ్, గజర్‌ కా హల్వా, బాదం హల్వా, శ్రీఖండ్(తీపి పెరుగు) ఉంటాయని తెలుస్తోంది. ఇక తాలీ విషయానికి వస్తే, కిచిడీ, కచోరీ, మేతి తెప్లా తదితర వంటకాలతో పాటు ఇండియాలోని పలు ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన వంటకాలను సిద్దం చేస్తున్నట్టు కిరణ్ వెల్లడించారు.