మొదటి మీటింగ్ లోనే షాకిచ్చిన మోడీ

July 12, 2020

పెద్ద నోట్ల రద్దు.. జీఎస్టీ అమలు.. గోసంరక్షణ పేరుతో దాడులు.. మైనారిటీలపై దాడులు.. ఇలా నరేంద్రమోదీ అయిదేళ్ల పాలనపై మాట్లాడుతూ ప్రజలకు ఎన్నో కష్టాలు పెట్టారంటూ విపక్షాలు ఆరోపిస్తుంటాయి. మోదీ పాలనలో ఉద్యోగాలు రాలేదని, రైతులు, సామాన్యులు కష్టాలు పడ్డారని పదేపదే అంటుంటాయి. ఇంత వ్యతిరేక ప్రచారం జరిగినా కూడా మోదీ గతం కంటే మరింత ఎక్కువ మెజారిటీతో ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి ప్రధాని పీఠంపై కూర్చున్నారు. అయితే... ఎంతో ముందుచూపు ఉన్న మోదీ, విపక్షాలు చేసే ఈ ప్రచారాలు మొదటి అయిదేళ్ల తన ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకతను తేలేకపోయినా కూడా రెండోసారి మరింత జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంలో కనిపిస్తున్నారు. ఆ క్రమంలో దేశంలోని వివిధ వర్గాలకు మేలు చేసే, ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మోదీ తన తొలి కేబినెట్ భేటీలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిటైల్‌ వ్యాపారులకు పింఛను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో సుమారు 3కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. అలాగే.. దేశంలోని రైతులందరికీ పీఎం కిసాన్‌ యోజన పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏటా దాదాపు రూ.14.5 కోట్ల మంది రైతులకు రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులకు పింఛను పథకానికి కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఉగ్రదాడులు, నక్సల్స్‌ దాడుల్లో అమరులైన జవాన్ల పిల్లలకు నెలనెలా భారత రక్షణ నిధి నుంచి ఇచ్చే ఉపకార వేతనాల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలి సంతకం చేశారు. బాలురకు నెలకు ఇచ్చే రూ.2వేల ఉపకారవేతనాన్ని రూ.2500లకు పెంచారు. అలాగే, బాలికలకు ఇచ్చే రూ.2250ను రూ.3వేలకు పెంచాలని నిర్ణయించారు. ఇప్పటివరకు కేంద్ర, పారామిలటరీ బలగాలకు మాత్రమే ఉన్న ఈ ఉపకార వేతనాలను ఇకపై రాష్ట్రాలకూ విస్తరించాలని నిర్ణయించారు. ఏడాదికి 500 మంది రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన వారిని ఎంపిక చేయనున్నారు.
హోంమంత్రి అమిత్‌షా సహా 24మంది కేబినెట్‌ మంత్రులు, 9మంది స్వతంత్ర హోదా కల్గిన మంత్రులు పాల్గొన్న ఈ భేటీలో పార్లమెంట్‌ సమావేశాల తేదీలను ఖరారు చేశారు. జూన్‌ 17 నుంచి జులై 26 వరకు పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. జూన్‌ 19న స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.