బాబు సలహా పాటించక తప్పలేదు మోడీకి !

June 27, 2019

ఏపీ ముఖ్య‌మంత్రి హోదాలో...తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు చెప్పిన మాట‌ను..దాదాపు మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత కేంద్రంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సర్కారు ఫాలో కానుంది. అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఉన్న‌త క‌మిటీకి నాయ‌క‌త్వం వ‌హించిన చంద్ర‌బాబు చేసిన సూచ‌న‌ల‌ను...ఆయ‌న అధికారంలో లేన‌ప్ప‌టికీ...రెండో ద‌ఫా అధికారం కైవ‌సం చేసుకున్న మోదీ ప్ర‌భుత్వం అమ‌లు చేసేందుకు స‌న్న‌ద్ధం అవుతోంది. ఈ మేర‌కు త్వ‌ర‌లో స్ప‌ష్ట‌త రానుంది. త్వ‌రోల ప్ర‌వేశ‌పెట్ట‌నున్న బ‌డ్జెట్ విష‌యంలోనే...ఈ చ‌ర్చ‌. బ్యాంకులు, ఏటీఎంల నుంచి ఇక ఏడాదికి రూ.10 లక్షలు మించి నగదు ఉపసంహరణలు చేసినైట్లెతే పన్నులు వేయాలని కేంద్రం యోచిస్తోంది. తద్వారా నల్లధనంపై ఉక్కుపాదం వేసినట్లు, డిజిటల్ లావాదేవీలకు ఊతం ఇచ్చినట్లూ అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం 2016లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి ముఖ్యమంత్రుల కమిటీ.. రూ.50,000లకుపైగా నగదు ఉపసంహరణలపై పన్ను వేయాలని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత కరెన్సీ వినియోగం తగ్గింపునకు పలు సూచనలనూ చేసింది. నల్లధనంపై ఏర్పాటైన సిట్ కూడా నగదు లావాదేవీల కోతకు పలు సిఫార్సులు చేసింది. అయితే ఇవన్నీ కూడా అమల్లోకి రాలేకపోయాయి. నిజానికి పాత పెద్ద నోట్ల రద్దు సమయంలో డిజిటల్ లావాదేవీలు పెరిగినా.. కరెన్సీ చలామణి పెరుగడంతో తగ్గిపోయాయి. ఈ క్రమంలో మోదీ సర్కారు మళ్లీ డిజిటల్ లావాదేవీలను పెంచడానికి నగదు లావాదేవీలపై పరిమితులు తెచ్చే ప్రయత్నం చేస్తోంది.

తక్కువ మొత్తాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న భౌతిక లావాదేవీలు నల్లధనానికి ఆస్కారమిస్తుండటం, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుండటంతోనే నగదు ఉపసంహరణలకు పరిమితి తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోంది. రాబోయే బడ్జెట్‌లో ఈ మేరకు ఓ ప్రకటన రావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే నెల 5న ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నది తెలిసిందే. దీంతో ఈ సందర్భంగా దీనిపై ఓ స్పష్టత వచ్చే వీలుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

మ‌రోవైపు, అధిక మొత్తంలో జరిగే అన్ని నగదు ఉపసంహరణలకు ఆధార్‌ను తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదననూ కేంద్రం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. దీనివల్ల సదరు వ్యక్తుల గుర్తింపు సులభతరమవుతుందని, ట్యాక్స్ రిటర్నులనూ పోల్చుకోవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే రూ. 50,000లకుపైగా డిపాజిట్లకు పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)ను ఇవ్వాల్సి వస్తున్నది. ఇప్పుడు విత్‌డ్రాలకు ఆధార్ నెంబర్‌ను ఇచ్చేలా చేస్తున్నారు. కాగా, ఆధార్ సంఖ్య దుర్వినియోగం కాకుండా వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ)తో రక్షణ కల్పించే వీలుందని అధికారులు చెబుతున్నారు. నిజానికి ఏటా రూ.10 లక్షలకుపైగా నగదు ఉపసంహరణలతో చాలా వరకు వ్యక్తులు, వ్యాపారులకు అవసరం ఉండదన్నది ప్రభుత్వ అభిప్రాయం. దీంతో ఆపై లావాదేవీలకు పన్నులు వేయడం సబబేనన్న అభిప్రాయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే పేద, మధ్యతరగతి వర్గాలపై ఎలాంటి పన్నుల భారం పడకుండా నిర్ణయాలుండాలన్నదే ప్రభుత్వ అభిమతమని వారు స్పష్టం చేస్తున్నారు.