జగన్ రిక్వెస్ట్ కు మోదీ ఓకే అన్నాడటా... ఏం ఫ్రెండ్షిప్పో ! 

August 08, 2020

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్ని వచ్చే నెల 30తో పదవీ విరమణ పొందనున్నారు. దీంతో జూలై 1 నుంచి ఏపీకి కొత్త సీఎస్ గా ఎవరు ఎంపిక అవుతారన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఈ తరహా పుకార్లకు చెక్ పెట్టేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... జూలై 1 నుంచి మరో ఆరు నెలలు అంటే డిసెంబర్ చివరి దాకా సీఎస్ గా నీలం సాహ్నీనే కొనసాగించుకునే దిశగా చర్యలు చేపట్టారట. ఈ క్రమంలో సాహ్నీ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని కేంద్రానికి విజ్ఝప్తి చేసిన జగన్.. మోదీ సర్కారుతో ఓకే అనిపించుకున్నారట.

సీఎస్ గా సాహ్నీ పనితీరుపై జగన్ సంతృప్తిగానే ఉన్నారని కొందరు అంటుంటే... ఆమె పనితీరు నచ్చని జగన్.. త్వరలోనే ఆమెను సదరు పోస్టు నుంచి తప్పించేందుకు ఆలోచిస్తున్నారని మరికొందరు అనుకొంటున్న వైనం మనకు తెలిసిందే. అయితే ఈ రెండు విషయాలను ఏమాత్రం పట్టించుకోని జగన్... సాహ్నీని ఆమె పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా మరో ఆరు నెలల పాటు అదే పదవిలో కొనసాగించేందుకు సిద్ధమయ్యారని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు తీసుకున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

సాహ్నీ పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ జగన్ చేసిన విజ్ఝప్తికి కేంద్రం సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ప్రస్తుతం సదరు ఫైల్ ప్రధానమంత్రిత్వ కార్యాలయంలో ఉన్నట్లుగా సమాచారం. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ క్లియర్ చేసిన ఫైల్ ను పీఎంఓ ఎలాగూ వెనక్కు తిప్పి పంపే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే... ఓ రాష్ట్రానికి చెందిన సీఎస్ పదవీ కాలాన్ని పెంచే విషయంలో ముందుగా పీఎంఓ అనుమతి తీసుకున్న తర్వాతే సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంటుంది. సో... ఏపీకి ఈ ఏడాది చివరి దాకా సాహ్నీనే సీఎస్ గా కొనసాగనున్నారన్న మాట.