ఇస్రో ఛైర్మన్ కంటతడి.. హత్తుకొని మరీ మోడీ ఊరడింపు

August 08, 2020

అతి తక్కువ బడ్జెట్ తో అత్యద్భుతమైన ప్రయోగానికి డిజైన్ చేయటం మాటలు కాదు. ఒక హాలీవుడ్ సినిమాకు అయ్యే ఖర్చులో కేవలం పదిశాతం ఖర్చుతో చంద్రయాన్ 2 లాంటి ప్రయోగాన్ని రెఢీ చేయటం మాటలు కాదు. ఇందుకోసం పడిన కష్టం.. శ్రమ అంతా ఇంతా కాదు. ప్రయోగం ఆరంభం నుంచి చివరి ఐదు నిమిషాల వరకూ అన్ని అనుకున్నట్లే జరిగినా.. సరిగ్గా ల్యాండర్ విక్రమ్ చంద్రుడి మీద ల్యాండ్ కావటానికి ముందు నుంచి సిగ్నల్స్ కట్ అయిపోవటంతో ఏం జరిగిందన్నది ఇప్పుడు పెద్ద ఉత్కంఠగా మారింది.
ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ ఒక్క రన్ తేడాతో ఓడితే ఎలా ఉంటుందో.. అంతకు కోటి రెట్ల బాధ ఇస్రో టీంది. ఇదిలా ఉంటే.. ఇస్రో ఛైర్మన్ పరిస్థితి ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సంతోషంలో పొంగిపోకుండా గంభీరంగా ఉండే ఇస్రో డైరెక్టర్ డాక్టర్ కె.శివన్ చిన్నపిల్లాడి మాదిరి కన్నీరు పెట్టారు.
ప్రధాని మోడీ మొదలుకొని ప్రముఖులతోపాటు అన్ని వర్గాలకు చెందిన వారితో పాటు.. సామాన్యులు సైతం ఎంతో ఉత్కంటగా ఎదురుచూసిన ప్రయోగం ఆఖరి నిమిషాల్లో ఫలితం తేలకుండా సంకేతాలు రావటం ఆగిపోవటం ఉద్వేగానికి గురవుతున్నారు. శాస్త్రవేత్తలు చేసిన కృషిని అన్ని వర్గాల వారు అభినందిస్తున్నారు.
ఇస్రో టీంను ఉద్దేవించి మోడీ భావోద్వేగ ప్రసంగం అనంతరం.. ఇస్రో డైరెక్టర్ వద్దకు మోడీ వచ్చిన సందర్భంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. దీంతో.. ఆయన్ను దగ్గరకు తీసుకున్న మోడీ.. హత్తుకొని మరీ ఊరడించారు. శాస్త్రవేత్తల అంకితభావాన్ని ఎవరూ శంకించలేరని.. భవిష్యత్తులో విజయాలు సాధిస్తారంటూ ఆయనలో ధైర్యం నింపటమే కాదు.. ఓదార్పు వచనాలు పలికారు.