మోదీ లెటర్.. జగన్ నుంచి నో రిప్లయ్.. ఎందుకు?

July 09, 2020

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై కేంద్రం కారాలుమిరియాలు నూరుతోంది. ప్రధాని కార్యాలయం నుంచి రాసిన లేఖకు ఎటు వంటి సమాధానం రాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. దీంతో... మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఘాటుగా లేఖ రాసింది. జగన్ ప్రభుత్వం మొండిగా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తున్న క్రమంలో కేంద్రం నుంచి వచ్చిన తాజా లేఖ రాజకీయ వేడిని రగిల్చింది.
పోలవరం పరిణామాలకు సంబంధించిన సమగ్ర వివ రాలతో కూడిన నివేదికను వెంటనే పంపాలంటూ రెండు వారాల కిందట ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై స్పందించకపోవడంతో కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పీఎంవో నుంచి రాసిన లేఖపై రెండు రోజుల్లోగా తగిన సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పోలవరం వ్యవహారంలో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ప్రాజెక్టు అధార్టీ కేంద్రానికి సమగ్ర నివేదిక అందజేసింది.

అనంతరం పోలవరం పరిణామాలు, రివర్స్‌ టెండరింగ్‌ పై ప్రాజెక్టు అధార్టీ విముఖత ప్ర దర్శించినా ముందుకెళ్లడం వెనుక ఉన్న ఆంతర్యమేంటనే దానిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరుతూ పీఎంవో లేఖ రాసింది. ఆ లేఖపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో తాజాగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఓపీ సిన్హా సోమవారం మరో లేఖ రాశారు. పోలవరం అధార్టీ నివేదిక, నిపుణుల కమిటీ నివేదిక మధ్య ఎందుకు తేడా ఉందో చెప్పాలని కూడా లేఖలో ప్రశ్నించారు. అయితే ఈ వ్యత్యాసాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు సమాధానం చెప్పలేదని ఆ లేఖలో ప్రశ్నించారు. మరి రాష్ట్ర ప్రభుత్వం దీనికైనా సమాధానమిస్తుందో లేదంటే బుట్టలో పడేస్తుందో చూడాలి.