ఏపీ ఐపీఎస్ బ‌దిలీలు... ఓ ప్ర‌మాద సూచిక‌

June 01, 2020

ప్ర‌జాస్వామ్య‌పు చెడు రోజుల‌కు ఏపీలోని ఐపీఎస్‌ల బ‌దిలీలు ప్ర‌మాద సూచిక అని *విశాలాంధ్ర మ‌హాస‌భ‌* గ‌ర్హించింది. దురుద్దేశ‌పు ఫిర్యాదుల మేర‌కు ఏపీ ఇంటెలిజెన్స్ అధికారి ఎ‌ బి‌ వెంకటేశ్వర రావు, కడప, శ్రీకాకుళం ఎస్పీ ల బదిలీలకు ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వటం భార‌త‌దేశ స‌మాఖ్య‌ వ్యవస్థ పై కేంద్రం యొక్క పెత్తందారీ నియంతృత్వ వైఖరికి నిదర్శనమ‌ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంద‌ని విశాలాంధ్ర మ‌హాస‌భ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌వితేజ ఆందోళ‌న వ్య‌క్తంచేశారు.
ఈ బ‌దిలీలు చేసే ముందు కొన్ని విష‌యాలు గ‌మ‌నించాలి. తన విధులను నిర్వహిస్తున్న ఇంటెలిజెన్స్ డి.జి‌.పి. వెంకటేశ్వరరావు పై కొందరి అసత్య ప్రచారాలు చేశారు. వాటిని ప‌రిగణలోకి తీసుకుని ఆయన పై త‌ప్పుడు ముద్రలు వేసి వ్యక్తిగత ప్రతిష్టని దెబ్బతీసే విధంగా వ్య‌వ‌హ‌రించారు. దీనిని త‌గిన విచార‌ణ చేప‌ట్ట‌కుండా ఎన్నికల విధుల నుంచి తొలగించటం పూర్తిగా గర్హనీయం. అసలు **రాజకీయాల గురుంచి తెలుసుకొని అధికారికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసమే ఇంటెలిజెన్స్ విభాగం పని చేయాలని పోలీసు మాన్యువల్ సూచిస్తుంది. అటువంటి విభాగంలో పని చేస్తున్న వ్యక్తులను తమ పనిని సక్రమంగా నిర్వహించినందుకే వారిని ఈ‌ విధంగా అవమానించటం వ్యవస్థకే చేటు** అని ఆయ‌న హెచ్చ‌రించారు.
కేంద్ర పాలకులు వ్య‌వ‌స్థ‌ల‌ను భ్ర‌ష్టుప‌ట్టిస్తున్నారు. తాము అనుకున్న‌ది జ‌ర‌గాల‌ని అనుకుంటున్నారు. కొంద‌రు అధికారులు వారికి అనుగుణంగా ప్రవర్తించటం జ‌రుగుతోంది. ఈ గోబెల్స్ ప్రచారాలతో అధికారులని భయపెట్టే ప్రయత్నం చెయ్యటాన్ని ప్రజాస్వామికవాదులు ఖండించాలని ఆయ‌న పిలుపునిచ్చారు.