కశ్మీర్ లో టాలీవుడ్... ఆఫర్ ఇచ్చిన మోడీ

February 17, 2020

ఏంటి హెడ్డింగ్ చూడగానే ఆశ్చర్యంగా అనిపించిందా?... సరదా వ్యాఖ్యలేం కావు. ఆ స్టూడియో పెద్దలు సిద్ధంగా ఉండాలే గానీ... స్టూడియోలు పెట్టడానికి అవసరమైన స్థలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు స్వయంగా ప్రధాని మోడీ ప్రకటించారు. జాతిని ఉద్దేశించి ఈరోజు ప్రధాని చేసిన ప్రసంగంలో తెలుగు సినిమా పరిశ్రమకు ప్రత్యేక గౌరవం ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే...

ఇపుడు కశ్మీర్ పూర్తిగా మనది. మనలో ఒక భాగం. కశ్మీర్, లద్ధాఖ్‌లలో ఇకనుంచి షూటింగ్స్ కూడా బాగా చేయండి. బాలీవుడ్ సినిమాల షూటింగ్స్ ఎలాగూ అక్కడ పెరుగుతాయి. బాలీవుడ్ తర్వాత ఎక్కువ సినిమాలు నిర్మించే తెలుగు సినిమా పరిశ్రమను, తమిళ ఇండస్ట్రీలని ఆహ్వానిస్తున్నాను. మీరు షూటింగ్స్ అక్కడ ఎక్కువగా చేసుకోండి. జమ్మూకశ్మీర్, లద్ధాఖ్‌ల అభివృద్ధిలో భాగం కండి. స్టూడియోలు పెట్టడానికి స్థలాలు కూడా ఇస్తాం. దర్శక నిర్మాతలు ఈ విషయంపై ఆలోచించండి.

ఇది మోడీ సినిమా పరిశ్రమలకు ముఖ్యంగా టాలీవుడ్ కు ఇచ్చిన పిలుపు. ఏకంగా కేంద్రం పూర్తి సెక్యూరిటీ ఇచ్చి, స్టూడియోలు పెట్టుకోవడానికి స్థలాలు ఇస్తామంటున్న నేపథ్యంలో... మన వాళ్లు సిద్ధంగా ఉండాలే గాని అక్కడ కూడా తెలుగు సినిమా స్టూడియోలు సులువుగా నిర్మించుకోవచ్చు. ఎలాగైనా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కృతనిశ్చయంతో ఉన్న మోడీ దానికోసం అన్ని అవకాశాలు వెదుకుతున్నారు. అందులో భాగమే టాలీవుడ్ కు పిలుపు. 

ఎపుడు దేని గురించి మాట్లాడితే దేశం దృష్టి సారిస్తుందే, ఎపుడు దేనికి పవర్ ఉంటందో మోడీకి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. టాలీవుడ్ తమ ప్రస్తావన గురించి కనీసం ఊహించని సందర్భాల్లో ఏకంగా స్థలాలు ఇస్తాం రమ్మని ప్రధాని పిలవడం సాధారణ విషయం కాదు. మరి దీన్ని తెలుగు సినిమాపెద్దలు ఎంతవరకు వాడుకుంటారో చూడాలి.