మోడీకి శివసేన భలే షాక్ ఇచ్చిందే

April 03, 2020

విష‌యం ఏదైనా స‌రే.. మొహ‌మాటం అన్న‌ది లేకుండా మాట్లాడే ధైర్య‌మున్న రాజ‌కీయ పార్టీల్లో శివ‌సేన‌ను ఒక‌టిగా చెబుతుంటారు. ప‌లువురు ఆరాచ‌క పార్టీగా సేన‌ను అభివ‌ర్ణించినా.. ఆ పార్టీ ఫిలాస‌ఫీని అభిమానించే వారు.. ఆరాధించే వారు మాత్రం.. దాన్ని విప‌రీతంగా ఇష్ట‌ప‌డుతుంటారు. దేశంలోని మైనార్టీల‌కు ద‌న్నుగా అన్ని రాజ‌కీయ పార్టీలు మాట్లాడ‌తాయి కానీ మెజార్టీల గురించి.. వారి మ‌నోభావాల గురించి ఏ రాజ‌కీయ‌పార్టీ మాట్లాడ‌వ‌ని.. ఆ కొర‌త‌ను శివ‌సేన తీరుస్తుంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తుంది.
ఎవ‌రికి న‌చ్చినా.. న‌చ్చ‌కున్న త‌న దారి గురించి గొప్ప‌గా చెప్పే శివ‌సేన‌. .హిందుత్వానికి పెద్ద పీట వేయ‌టం.. స‌నాత‌న అంశాల విష‌యంలో నిక్క‌చ్చిగా ఉంటుంది. ప‌లు వివాదాస్ప‌ద అంశాల్లో త‌న స్టాండ్ ను క్లియ‌ర్ గా చెప్పేసే శివ‌సేన తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతుంటారు.
ఇదిలా ఉండ‌గా.. ఊహించ‌ని రీతిలో కొత్త డిమాండ్ ను తెర మీద‌కు తీసుకొచ్చింది శివ‌సేన‌. ఇటీవ‌ల శ్రీ‌లంక‌లో ఎలా అయితే.. బుర్ఖా విధానాన్ని నిషేధించారో.. అదే తీరులో భార‌త్ లోనే బుర్ఖా విధానాన్ని నిషేధించాల‌ని డిమాండ్ చేసింది. ట్రిపుల్ త‌లాక్ విష‌యంలో తీసుకున్న‌ట్లే.. బుర్ఖా విష‌యంలోనూ నిర్ణ‌యం తీసుకోవాల‌ని ప్ర‌ధాని మోడీని కోరింది.
రావ‌ణుడు పుట్టిన దేశమైన లంక‌లోనే బుర్ఖాల మీద బ్యాన్ చేయ‌గా లేనిది.. రాముడు పుట్టిన దేశంలో చేస్తే త‌ప్పేంటి? అని సూటిగా ప్ర‌శ్నిస్తోంది. ఈస్ట‌ర్ డే చోటు చేసుకున్న ఉగ్ర పేలుళ్ల నేప‌థ్యంలో శ్రీ‌లంక‌లో బుర్ఖాను బ్యాన్ చేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే.
ఈ ఇష్యూ మీద తాజాగా త‌న దిన‌ప‌త్రిక అయిన సామ్నాలో స్పందిస్తూ.. భ‌ద్ర‌తా చ‌ర్య‌ల్లో భాగంగా బుర్ఖాను నిషేధిస్తూ ప్ర‌భుత్వం వెంట‌నే నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరింది. ముఖాల‌ను క‌ప్పి ఉంచే వ‌స్త్రాలు.. బుర్ఖాల కార‌ణంగా జాతీయ భ‌ద్ర‌త‌కు ప్ర‌మాదం వాటిల్లే అవ‌కాశం ఉంద‌న్నారు. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేసినంత ధైర్యంగా బుర్ఖా బ్యాన్ మీద నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు.
ఇస్లాంను చాలామంది స‌రిగ్గా అర్థం చేసుకోవ‌టం లేద‌ని.. బుర్ఖా.. బ‌హుభార్య‌త్వం.. ట్రిపుల్ త‌లాక్ లాంటి వాటితో విపరీత‌మైన గంద‌ర‌గోళంగా మారింద‌న్నారు. వీటికి వ్య‌తిరేకంగా ఎవ‌రైనా మాట్లాడితే.. ఇస్లాం ప్ర‌మాదంలో ప‌డిందంటూ గోల చేస్తుంటార‌న్నారు. శ్రీ‌లంక అధ్య‌క్షుడు రాత్రికి రాత్రే ధైర్యంతో నిర్ణ‌యం తీసుకున్నార‌ని.. ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌టానికి ఎంతో సాహ‌సం అవ‌స‌ర‌మ‌ని పేర్కొంది. మ‌రి.. మిత్రుడు కోరిన‌ట్లుగా మోడీ.. బుర్ఖా విష‌యంలో సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాన్ని తీసుకోగ‌ల‌రా?