జగన్ కు మోదీ బిగ్ షాక్... 

May 29, 2020

ఈ వార్తను పరిశీలిస్తే... వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు నిజంగానే బిగ్ షాకిచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే... తాను అవినీతి అధికారి అంటూ ముద్ర వేసిన ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ కు మోదీ సర్కారు ప్రమోషన్ ఇవ్వడంతో పాటుగా ఐటీ శాఖలో ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గా కీలక బాధ్యతలు అప్పగించింది. అంతేకాదండోయ్... ఏపీ సర్వీసుల నుంచి రిలీవ్ అయి కేంద్ర సర్వీసుల్లో చేరిన వెంటనే జాస్తికి మోదీ సర్కారు ప్రమోషన్ తో పాటు కీలక బాధ్యతలు అప్పగించడం చూస్తుంటే.. జగన్ కు మోదీ పెద్ద దెబ్బే కొట్టారని చెప్పక తప్పదు.

టీడీపీ హయాంలో రాష్ట్ర సర్వీసులకు వచ్చిన జాస్తికి ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈఓగా కీలక బాధ్యతలు దక్కాయి. ఆర్థిక లోటుతో కొత్త పయనం మొదలెట్టిన ఏపీకి విదేశీ పెట్టుబడులను తీసుకువచ్చేందుకు నాడు జరిగిన పెద్ద కసరత్తులో జాస్తి కీలకంగా వ్యవహరించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్.. సీఎం పదవీ చేపట్టిన వెంటనే జాస్తిపై కమ్మ కులం ముద్ర వేసి వేధింపులకు శ్రీకారం చుట్టారు. ఏపీఈడీబీ సీఈఓ పదవి నుంచి తప్పించి... ఆయనపై అవినీతి అధికారి అంటూ ముద్ర వేసి ఏకంగా కేసులు కూడా నమోదు చేశారు. అంతేకాకుండా కేసుల దర్యాప్తు పూర్తయ్యేదాకా అమరావతిని వీడరాదంటూ జాస్తిపై ఆంక్షలు విధించారు. 

ఈ నేపథ్యంలో జాస్తి న్యాయపోరాటం ప్రారంభించారు. నేరుగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ (క్యాట్)ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన క్యాట్ జాస్లిపై సస్పెన్షన్‌పై స్టే విధించింది. ఆనంతరం ఆయన సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై ఉన్న కృష్ణకిశోర్‌ను వెంటనే ఆదాయ పన్ను శాఖలో చేర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే కేంద్ర సర్వీసులకు వెళ్లిన జాస్తికి వెనువెంటనే ప్రమోషన్ ఇచ్చిన కేంద్రం... ఐటీ శాఖలో ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గా కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ ప్రమోషన్ తో జాస్తిపై జగన్ సర్కారు వేసిన అవినీతి అధికారి ముద్రను కేంద్రం చెరిపేసిందనే చెప్పాలి.