మీడియా చేసిన తప్పు మోడీకి హెల్ప్ అయ్యింది

May 29, 2020

ప్ర‌ధాని మోడీని పొగిడే వాళ్లు కోట్ల‌ల్లో ఉంటారు. అదే స‌మ‌యంలో ఆయ‌న‌పై నిప్పులు చెరిగేవారు భారీగానే ఉంటారు. అదే ప‌నిగా మోడీని పొగ‌డ‌టం ఎంత త‌ప్పో.. అదే మాదిరి మోడీని త‌ప్పు ప‌ట్ట‌టం కూడా అంతే పెద్ద త‌ప్పు. అంశాల వారీగా త‌ప్పు చేస్తే ఎత్తి చూప‌టం.. ఒప్పు చేస్తే మంచి చేస్తున్నార‌న్న విష‌యాన్ని చెప్ప‌టంలో మీడియా త‌న ధ‌ర్మాన్ని పాటించ‌లేద‌నే చెప్పాలి.
ఈ కార‌ణంతోనే మోడీని ఎవ‌రైనా విమ‌ర్శించినా.. త‌ప్పు ఎత్తి చూపినా.. మోడీ ప‌రివారం కానీ.. ఆయ‌న్ను అభిమానించి.. ఆరాధించే వారంతా క‌స్సుమంటారు? మోడీ లాంటి నాయ‌కుడ్ని మీరు జీర్ణించుకోలేరు. అందుకే.. ఆయ‌న్ను బ‌ల‌హీన‌ప‌ర్చ‌టానికి ఏదో కుట్ర చేస్తున్నార‌న్న మాట‌ను అదే ప‌నిగా చెబుతుంటారు. నిజ‌మే.. మోడీ విష‌యంలో మీడియా వ్య‌వ‌హ‌రించిన ధోర‌ణిని త‌ప్పు ప‌ట్ట‌కుండా ఉండ‌లేం. మిగిలిన నేత‌ల మాదిరి కాకుండా.. మోడీని ఓ పెద్ద బూచిగా చూపించే ప్ర‌య‌త్నంలో దిద్దుకోలేని త‌ప్పు చేసింది మీడియా.
దీనికి గ‌డిచిన కొంత‌కాలంగా ఫ‌లితాన్ని అనుభ‌విస్తుంద‌ని చెప్పాలి. సాపేక్షంగా వ్య‌వ‌హ‌రించాల్సిన దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన మీడియా విశ్వ‌స‌నీయ‌త మీద సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేయ‌టంలో మోడీ స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి. ఇప్పుడ‌దే ఆయ‌న‌కు ఆయుధంగా మారింది. మోడీని పొగిడేస్తూ క‌థ‌నాలు వ‌స్తే.. ఇన్నాళ్ల‌కు న‌మోను గుర్తిస్తున్నార‌నే ఎట‌కారం.. అదే స‌మ‌యంలో త‌ప్పును ఎత్తి చూపిస్తే.. పాత తీరు మార్చుకోరా? అంటూ ఎక్కెసం చేయ‌టం ఇప్పుడు ఒక అల‌వాటుగా మారింది.
ఇదిప్పుడు మీడియాకు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. న‌మోకు సంబంధించి ఏ నెగిటివ్ విష‌యాన్ని చెప్పినా.. దాన్ని న‌మ్మ‌ని ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు ఉంటున్నారు. దీనికి కార‌ణం లేక‌పోలేదు. రాజ‌కీయ నేత‌లు చెప్పే సెక్యుల‌రిజానికి.. మీడియా చెప్పే దానికి పెద్ద వ్య‌త్యాసం ఉండ‌ద‌న్న ఆరోప‌ణ‌కు త‌గ్గ‌ట్లే దాని వ్య‌వ‌హార‌శైలి ఉండ‌టం.. వార్త‌ల విష‌యంలో ఇదే తీరును ప్ర‌ద‌ర్శించ‌టం కూడా మోడీకి లాభించింద‌ని చెప్పాలి.
దేశంలో మెజార్టీలైన హిందువుల ప్ర‌యోజ‌నాల్ని ప‌రిర‌క్షించే విష‌యంలో మోడీకి మించినోళ్లు ఎవ‌రూ లేర‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉండ‌టం క‌నిపిస్తుంది. ఎందుకిలా అంటే.. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఆయా వ‌ర్గాన్ని ఒక వ‌ర్గంగా గుర్తించ‌టంలో సోకాల్డ్ మీడియా ఫెయిల్ కావ‌టం ఒక కార‌ణంగా చెప్ప‌క త‌ప్ప‌దు. చేసిన త‌ప్పును గుర్తించ‌టంలో నేటికి మీడియా క‌ళ్లు తెర‌వ‌లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. దీని ఫ‌లితంగానే.. మోడీ చేసే త‌ప్పుల‌ను చెప్పే మీడియాను ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌ట‌మే కాదు.. విష ప్రచారం చేస్తున్నార‌న్న మాట వ‌స్తోంది. మీడియా బ‌ల‌హీన‌త‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌టంలో మోడీ ఘ‌న విజ‌యం సాధించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.