నన్ను చంపేస్తారంటూ మోడీ సంచలన ప్రకటన

May 31, 2020

ఇటీవల పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆ దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం రంగంలోకి దిగి ఉగ్రశిబిరాలను టార్గెట్ చేయడం.. ఆ తర్వాత పాక్ రియాక్షన్.. ఇలా దేశంలో తాజా పరిస్థితులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే భయపడాల్సిందేమీలేదని, ఇది మోడీ చేస్తున్న ఎన్నికల స్టెంట్ మాత్రమే అని కొందరు ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పాట్నాలో జరిగిన ఎన్డీయే సభ (సంకల్ప్ ర్యాలీ)లో మోడీ సంచలనంగా మాట్లాడారు.

 

 

యురిలో ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత సైనికదళం నిర్వహించిన లక్షిత దాడులను, పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా నిర్వహించిన వైమానిక దాడులను విపక్షాలు శంకిస్తుండటం సిగ్గు చేటని మోడీ మండిపడ్డారు. అవినీతిని, పేదరికాన్ని నిర్ములిస్తూనే దేశ భద్రత కోసం ఉగ్రవాదాన్ని తుదముట్టించే దిశగా తాను అడుగులు వేస్తుంటే.. మరోవైపు ప్రతిపక్షాలు తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు మోడీ. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ కు మేలు చేసేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ ఉగ్రవాదాన్ని పెంచి ప్రోస్త్సహిస్తుందనే ఆరోపణలు వస్తున్న ఈ తరుణంలో..  తమను తాము కాపాడుకునేందుకు మన విపక్షాల వ్యాఖ్యలు వారికి రక్షణ కవచంగా ఉపయోగపడుతున్నాయని మోడీ అన్నారు. `దేశమంతా ఒకే మాట మాట్లాడాల్సిన ఈ సమయంలో.. మన చర్యలను ఖండిస్తూ తీర్మానం చేసేందుకు 21 ప్రతిపక్షాలు ఢిల్లీలో సమావేశమవటం సమంజసమేనా అని ఆయన అన్నారు. మన సాయుధ బలగాల వీరోచిత చర్యకు రుజువులు చూపాలని ఆ పార్టీలు డిమాండ్ చేస్తుండటం ఏంటని మోడీ ప్రశ్నించారు.  

 

 

బీహార్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ని కూడా కడిగి పారేశారు ప్రధాని మోడీ. దాణా కొనుగోలు పేరుతో బీహార్ లో ఏమి జరిగిందో ఆ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. ప్రజాధనాన్ని దారిమళ్లించే మధ్యవర్తులకు అడ్డుకట్ట వేసేందుకు మా ప్రభుత్వం కృషి చేసింది. చీకటి రోజుల నుంచి బీహార్ ను బయటికి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని మోడీ పేర్కొన్నారు. బీహార్ లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ఎన్డీయే ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. అయినా తనను విమర్శించేందుకు విపక్షాలు పోటీపడుతున్నాయని, ఆ పార్టీలను మరోసారి శిక్షించి మరిన్ని గుణపాఠాలు చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని మోడీ చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అత్యుత్తమ సౌకర్యాలను అందించాలని తమ ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నదని ప్రకటించారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ హాట్ చర్చలకు దారితీస్తున్నాయి.