ఏపీలో మోదీ రహస్య సర్వే.. ఏ పార్టీ కోసమో..!

July 15, 2020

ఆంధ్రప్రదేశ్‌లో ఉనికిని కోల్పోయి కష్టాలు పడుతున్న భారతీయ జనతా పార్టీని ఒడ్డున పడేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్లాన్ చేస్తున్నారా..? ఇందుకోసం ఆయన మరో పార్టీతో కలిసి పయనించబోతున్నారా..? ప్రస్తుతం దీనికి సంబంధించిన రహస్య సర్వేను ఏపీలో నిర్వహిస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విభజన హామీల విషయంలో మోసం చేసిందనే కారణంతో ఏపీలో బీజేపీ దోషిలా మిగిలిపోయింది. గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆ పార్టీ.. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలపడాలని భావించింది. అయితే, ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. ఎన్డీయే నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి బీజేపీకి కష్టాలు మొదలయ్యాయి. టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన ద్రోహాన్ని వివరించడంలో సక్సెస్ అవడంతో ఆ పార్టీ మనుగడను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగేలా ఆ పార్టీ నేతలను సన్నద్ధం చేసింది బీజేపీ అధిష్టానం. దీనితో పాటు వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం కొన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుందట భారతీయ జనతా పార్టీ.

 

 ఇందు కోసమే ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో రహస్య సర్వే నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. గతంలో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా పలుమార్లు సర్వేలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన మాత్రం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై సర్వే నిర్వహించగా, మోదీ మాత్రం వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిని వరించబోతుందన్న దానిపై సర్వే చేయిస్తున్నారని సమాచారం. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది..? ఆ పార్టీకే మీరు ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నారు..? ప్రస్తుత సమయంలో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది..? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి నిధులు వచ్చాయన్న విషయం మీకు తెలుసా..? ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీ బాగా పోరాటం చేస్తోంది..? చంద్రబాబు, జగన్‌లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది..? కేంద్రం, ప్రధాని మోదీ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా..? అనే ప్రశ్నలతో కూడిన సర్వేను మోదీ నియమించిన బృందం ఏపీలో చేపట్టిందని తెలిసింది. అయితే, ఈ సర్వేలో వచ్చే ఫలితాలతో ఆయన ఏ రకమైన ముందడుగు వేస్తారన్నది మాత్రం తెలియరావడం లేదు. ఏదిఏమైనా మోదీ ఏం చేసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసమే ఉంటుందనే టాక్ మాత్రం వినిపిస్తోంది.