మోడీ స్పెషల్ స్పీచ్ - కశ్మీరీలకు 2 గుడ్ న్యూస్ లు

July 13, 2020

70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ ప్రధాని చేయని ధైర్యం చేశారు ప్రధాని నరేంద్రమోడీ. ఒక్క రోజులో మొత్తం జమ్ము కాశ్మీర్ ను మూడు ముక్కలు చేసి అదే రోజు గెజిట్ నోటిఫికేషన్ తెచ్చారు. దీనిపై మూడు రోజులుగా దేశంలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 8 గంటలకు మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో కశ్మీర్ విభజన వల్ల స్థానికులు ఎలా లాభపడనున్నది? భవిష్యత్తును ఎలా నిర్మించుకోనున్నది ప్రధాని వివరించారు.

ఈ ప్రసంగంలో మోడీ చేసిన ఒక ప్రకటన... సంచలనంగా ఉందని చెప్పాలి. దేశ వ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ విభజన వల్ల మెజారిటీగా ఉన్న ముస్లిం స్థానికులు మోడీపై ఆగ్రహంగా ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ... త్వరలో అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇపుడు ఎన్నికలు పెట్టడం అంటే... బీజేపీ చాలా ధైర్యం చేసిందనే చెప్పాలి. మరి విభజన వ్యతిరేకతను ఎలా ఎదుర్కొంటుంది అన్నది ఆశ్చర్యకరమే. దీనికి దేశమంతటా మోడీకి సానుకూలంగా ఉన్నా మెజారిటీగా ఉన్న కశ్మీరీ ముస్లింల మద్దతు ఎవరికి అన్నది పెద్ద ప్రశ్న?

ఎన్నికలపై మోడీ చాలాసేపు మాట్లాడారు. ‘‘గతంలో పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగాయి. అప్పుడు ఎన్నికైన సర్పంచ్‌లు అద్భుతంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా మహిళా సర్పంచ్‌లు బాగా పనిచేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది వేగం పుంజుకుంది. అలాగే, మరికొన్ని రోజుల్లో జమ్మూ, కాశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు తమ ఎమ్మెల్యేను ఎన్నుకోవచ్చు. ముఖ్యమంత్రి కూడా ఉంటారు‘‘ అంటూ మోడీ వెల్లడించారు.
కశ్మీర్ విభజన తర్వాత అక్కడి ప్రజలకు దినసరి కనీస వేతంన అందిస్తామని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మోడీ అన్నారు. ఇక నుంచి కశ్మీర్‌లో వ్యాపారం మెరుగవుతుందన్నారు. కశ్మీర్ ప్రజలకు ప్రధానమంత్రి స్కాలర్ షిప్ కూడా అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. విభజనకు ముందు చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అదేసమయంలో కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించే అన్ని ప్రయోజనాలు కశ్మీర్ ఉద్యోగులకు వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్ పర్యాటక రంగం ఇకపై శరవేగంగా అభివృద్ధి చెందుతుందని మోదీ చెబుతూ.. ఒక నవ యుగానికి కశ్మీర్ నాంది పలకనుందన్నారు.