రాహుల్ గాంధీ ‘రహస్య వ్యవహారాల’కు చెక్ పెడుతున్న మోదీ

June 03, 2020

హఠాత్తుగా విదేశాలకు చెక్కేసి.. ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియకుండా గుట్టుగా గడిపేసి తిరిగి ఇండియాకు వచ్చేసే విపక్ష నేత రాహుల్ గాంధీ ఇకపై అలాంటి సీక్రెట్ వ్యవహారాలు సాగించడానికి వీల్లేకుండా మోదీ ప్రభుత్వం ముకుతాడు వేస్తోంది. చట్టబద్ధంగా రాహుల్ గాంధీని గవర్నమెంట్ రాడార్‌లోకి వచ్చేలా కేంద్రం పావులు కదిపింది. ఇందుకు కారణం ఆయన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్‌పీజీ) రక్షణలో ఉండడమే.
ఎస్పీజీ నియమనిబంధనలకు కేంద్ర హోం శాఖ సమూలంగా మార్చేస్తోంది. తమ భద్రతలో ఉండే నాయకుల పర్యటనలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి తెలియజేసే విధంగా నియమాలను సవరిస్తున్నారు. రాహుల్ లాంటి నాయకులు విదేశీ పర్యటనకు వెళ్లేటప్పుడు ఎస్‌పీజీ భద్రతా సిబ్బందిని ఇక్కడే వదిలివేసి వెళ్లేవారు. అయితే ఇకపై అది సాధ్యం కాదు. ఎస్‌పీజీ రక్షణ కవచంలో ఉండే నాయకులు ఇకమీదట ఏ విదేశానికి వెళ్లినా ఎస్‌పీజీ అధికారులను తమ వెంట తీసుకువెళ్లాల్సిందే.
గతంలో ఎస్పీజీ కవర్‌లో ఉండే నాయకులు విదేశాలకు వెళ్లేటప్పుడు ఇక్కడి భద్రత తీసుకునేవారు కాదు. కొందరేమో విదేశాల్లో ఒక దశ వరకు భద్రత ఉంచి, ఆ తరువాత భద్రత లేకుండా మాయమయ్యేవారు. స్వదేశం వరకే ఎస్‌పీజీ కవర్.. విదేశాల్లో తమకు ఆ రక్షణ అవసరం లేదని నాయకులు ఇక మీదట చెప్పేందుకు వీలుండదని హోం శాఖ అధికారులు చెబుతున్నారు. అధికార, ప్రతిపక్షానికి చెందిన పలువురు నాయకులు విదేశీ పర్యటననల్లో ఎస్‌పీజీ లేదా బ్లాక్ క్యాట్ కమాండోల సేవలను ఉపయోగించుకోరు. కొత్త నియమ, నిబంధనల ప్రకారం ఈ విధంగా చెప్పేందుకు వీలుండదు. ఎస్‌పీజీ నియమ, నిబంధనలను సవరించటం ద్వారా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తరచూ జరిపే విదేశీ పర్యటనలపై ఒక కన్నేయడమే లక్ష్యంగా ఈ మార్పు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.