తెలుగు రాష్ట్రాలు మూసుక్కుర్చోవాల్సిందే

July 10, 2020

అదేంటండీ అంత మాట అనేశారు అని బాధపడినా... ఇపుడు వాస్తవం కఠినంగానే ఉంది. ఎన్డీయే కూటమి 353 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. సొంతంగా బీజేపీకే 303 సీట్లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులకు- బీజేపీ కూటమికి సంబంధం లేదు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు మోడీని డిమాండ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. గట్టిగా అడిగితే ఇవ్వను పో అనేలా ఉన్నారు. పైగా రెండోసారి సొంతంగా గెలిచాక మోడీ మాట వింటాడా?
ఫలితాలకు ముందు కేంద్రంలో హంగ్ ఏర్పడుతుందని తెలుగు రాష్ట్రాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఎన్నికలకు ముందు చంద్రబాబు, జగన్, కేసీఆర్ ... అందరూ కేంద్రంలో కీలకపాత్ర మనదే అని ఫిక్సయిపోయారు. మొత్తం సీన్ రివర్సయ్యింది. బీజేపీపై వ్యతిరేకత ఉందని చాలా మంది భావించారు . అయితే ఆ లెక్కలన్నీ తప్పని తేలుస్తూ బీజేపీ స్పష్టమైన మెజార్టీతో అధికారం సంపాదించుకుంది.
​మో​డీ మరో ఐదేళ్లు ప్రధాని అవ్వడం ఖాయమైపోయింది. అయితే ప్రాంతీయ పార్టీల మద్ధతు కూడా ఇప్పుడు మో​డీకి అవసరం లేదు.​ కూటమిలో లేకపోవడంతో​9 సీట్లున్న టీఆర్ఎస్‌కి, 22 సీట్లున్న వైసీపీకి కేబినెట్‌లో ​ చేరే అవకాశమూ లేదు. అయితే, ముందునుంచి జగన్ మోడీతో సఖ్యతగా ఉండటం వల్ల ఏమైనా లాభిస్తుందా? లేక చంద్రబాబుకు హ్యాండిచ్చినట్లే మోడీ జగన్ కు హ్యాండిస్తాడా? అన్నది వేచి చూడాలి. పైగా బీజేపీలో ఏపీకి డిపాజిట్లు రాకపోవడం మోడీ - అమిత్ షాలకు ఎంతో కొంత ఇగో దెబ్బ తీస్తుంది కదా. మరి అలా అవమానించిన రాష్ట్రానికి వారు ఇస్తారా? ఇవ్వరా అన్నది అనుమానం. తెలంగాణ మాత్రం అనూహ్యంగా నాలుగు సీట్లు బీజేకి ఇవ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాల కోటాలో ఒకరు మంత్రి అయినా ఆశ్చర్యం లేదు. అసలు తెలుగు వారి సహకారం లేకుండా మోడీ ప్రధాని కావడం తెలుగు వారి దురదృష్టం.