సోమవారం ఏపీలో అల్లకల్లోలమే !

February 23, 2020

అవును. అమరావతి మార్పు ప్రకటనతో అశాంతి, ఆందోళన నెలకొన్న ఏపీ సోమవారం అల్లకల్లోలం అయ్యేప్రమాదం కనిపిస్తోంది. ప్రజాభీష్టానికి విరుద్దంగా ముఖ్యమంత్రి జగన్ మొండిపట్టుకు పోయి రాజధాని మార్పునకు శ్రీకారం చుట్టడంతో జనం బెంబేలెత్తిపోయారు. అన్నీ ప్రశాంతంగా సాగుతూ విభజన గాయాలు మెల్లగా మానుతున్న సమయంలో ఏపీకి ఏకంగా హార్ట్ ఎటాక్ తెప్పించారు వైఎస్ జగన్. రాజధాని అక్కడ ఉన్నా, మార్చినా కొత్తగా ఒరిగే ప్రయోజనం ఏం లేదు. మిగతా అభివృద్ధి పనులు అన్నీ ఆపేసి ప్రజలంతా రాజధాని గురించి తప్ప దేని గురించి మాట్లాడకుండా చేసిన జగన్ ఏపీలో ఏదో పెను ఉపద్రవానికి కారణం అయ్యేలా ఉన్నాడు. 

ఇప్పటికే రాజధానిపై రెండు నామ్ కే వాస్తే కమిటీలు జగన్ మనసులో మాటను పేపరు మీద రాసుకొచ్చాయి. బోస్టన్ కమిటీ, జీఎన్ రావు కమిటీలు చేసిన ప్రతిపాదనలను మంత్రులతో వేసిన హైపవర్ కమిటీ పరిశీలించి మరో నివేదికను తయారుచేసిందట. దానిని సోమవారం ముఖ్యమంత్రికి ఇవ్వనున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... అదే రోజు కేబినెట్ మీటింగ్, అసెంబ్లీ సమావేశం రెండూ ఉన్నాయి. అంటే... తమకు నచ్చినట్లు గీసుకున్న ప్లాన్ ను కేబినెట్లో వెంటనే ఆమోదించుకుని ఆ తర్వాత అసెంబ్లీలో మంద బలంతో ఓకే చేసుకుని ఇష్టానుసారం రాజధానిని మార్చేయడానికి జగన్ సిద్ధమైపోయారు. 

తమ ఆందోళనలు ఉదృతం చేశాం కాబట్టి ప్రభుత్వం దిగివస్తుందని భావిస్తున్న రైతులు, అన్ని ప్రాంతాల ప్రజలు... భ్రమిస్తున్నారు. ఒకవేళ జగన్ కనుక అనుకున్నది చేస్తే... వారు ఎలా రియాక్టవుతారో తెలియదు. ఎన్ని గుండెలు ఆగిపోతాయో తెలియదు. అసెంబ్లీ తీర్మానం అయిపోయినా కాకపోయినా రాజధానిని మార్చుకునే హక్కు రాష్ట్రానికి ఉండటం, జగన్ మొండితనం కలగలపి ఏమైనా జరిగే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీలో కనుక రాజధాని తరలింపును ఖాయం చేస్తే ఆరోజు ఏపీ అల్లకల్లోలం అయిపోయే అవకాశాలు పుష్కలం. 

కొసమెరుపు ఏంటంటే... సరిగ్గా వీటన్నింటి ముందు జగన్ ఢిల్లీ వెళ్తున్నాడు. మరి రాజధాని గురించి కేంద్ర పెద్దలు ఏమైనా జగన్ తో మాట్లాడతారా? వారి ప్లాన్ ఏంటి? జగన్ వారి మాట వింటాడా? కేసులకు భయపడి రాజధానిపై వెనక్కు తగ్గుతాడా? అసలు ఇందులో బీజేపీ పాత్ర ఏంటి...? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ త్వరలో సమాధానాలు దొరుకుతాయి.