కన్నాపై కంప్లయింట్.. విశాఖ నేతల వెనుక ఉన్నదెవరు?

February 25, 2020

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై కంప్లయింట్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దిల్లీ కేంద్రంగా పనిచేసే ఆ పార్టీలోని నాయకులే ఆయనకు పొగపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని ఆయనే స్వయంగా తన అనుచరుల వద్ద వాపోతున్నారని చెబుతున్నారు. అయితే.. దిల్లీ కేంద్రంగా పనిచేసే ఆ నాయకుల ప్రయత్నాలు చేస్తున్నా అధిష్ఠానం కన్నాని మార్చేందుకు ఇప్పటికిప్పుడు ఏమీ చర్యలు తీసుకోకపోవడంతో వారు కొత్త వ్యూహాలతో కన్నా వ్యతిరేక ప్రచారానికి తెర తీశారని టాక్. అందులో భాగంగా జిల్లాల్లోని బీజేపీ నాయకులతో అధిష్ఠానికి ఫిర్యాదులు చేయిస్తున్నారని వినికిడి.
తాజాగా విశాఖ జిల్లాకు చెందిన కొందరు నాయకులు దిల్లీలోని బీజేపీ పెద్దలకు కన్నా లక్ష్మీనారయణపై ఫిర్యాదు చేశారట.  కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షునిగా పనికి రారని ఆ ఫిర్యాదులలో ఆరోపించడంతో పాటు కన్నా నియోజకవర్గంలో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకుంటే ఆయన ఆ పదవిలో ఉండాలో వద్దో నిర్ణయించుకోవచ్చని అధిష్ఠానికే సూచనలు చేశారట ఆ పార్టీ నేతలు.  కన్నీ తన  ఆస్తులను కాపాడుకునేందుకు బిజిపిలోకి వచ్చారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెబుతున్నారు.
అయితే.. విశాఖ నేతల ఫిర్యాదుల వెనుక కూడా దిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేసే ఇద్దరు బీజేపీ నాయకుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల ముందు నుంచి పార్టీని నడిపిస్తూ, సొంత డబ్బులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా తనకు సరైన ప్రాదాన్యం లేకుండా పోయిందని.. రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని ఆశించినా అదీ దక్కలేదని కన్నా వాపోతున్నట్లు తెలుస్తోంది. పైగా ఎంత చేసినా ఈ కంప్లయింట్లు వస్తున్నాయంటూ ఆయన ఆవేదన చెందుతున్నారట.