కష్టం ఈ రాష్ట్రాలకే !

August 11, 2020

కరోనాతో యావత్ ప్రపంచం కిందామీదా పడుతున్న వేళ.. 134 కోట్లకు పైగా ఉన్న భారత్ లో దాని ప్రభావం తక్కువనే చెప్పాలి. మిగిలిన దేశాలతో పోలిస్తే.. భారత్ లో ముందే లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకురావటం.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటంతో కరోనా ముప్పు పెద్ద ఎత్తున తప్పినట్లుగా చెబుతారు. విదేశీ ప్రయాణికులతో పాటు.. మర్కజ్ ఎపిసోడ్ల కారణంగా ఆందోళన కలిగించే రీతిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ ను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నప్పటికి కేసుల నమోదవుతున్న వైనంపై ఆసక్తికర విశ్లేషణ ఒకటి తెర మీదకు వచ్చింది.

దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో 92 శాతం కేవలం 12 రాష్ట్రాల పుణ్యంగా చెబుతున్నారు. ఇదంతా నోటి మాటగా చెబుతున్నది కాదని.. గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 18,985 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 92 శాతం  కేసులు పన్నెండు రాష్ట్రాలకు చెందినవే కావటం గమనార్హం. అయితే.. మరణాల రేటు తక్కువగా ఉండటం కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితి.
ఇంతకీ పన్నెండు రాష్ట్రాల్లోనే 92 శాతం పాజిటివ్ కేసులు ఎందుకు నమోదు అవుతున్నట్లు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ రాష్ట్రాలకు విమానాల రాకపోకలు.. విదేశీ ప్రయాణికుల సంఖ్య అత్యధికంగా ఉండటం కారణంగా చెబుతున్నారు. దేశంలోని ప్రముఖ నగరాలన్ని ఈ పన్నెండు రాష్ట్రాల్లోనే ఉండటం మరో కారణం. ఈ నగరాలన్ని వాణిజ్య ప్రాంతాలుగా.. పర్యాటక ప్రదేశాలుగా ఉండటమే కాదు.. అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలుగా ఉండటం కూడా కరోనా విస్తరణకు కారణాలుగా చెబుతున్నారు.
ఇంతకీ ఆ పన్నెండు రాష్ట్రాలు ఏమిటి? దేశ వ్యాప్తంగా నమోదైన కేసులతో పోల్చినప్పుడు ఆయా రాష్ట్రాల శాతం ఏమిటన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
రాష్ట్రం                                మొత్తం కేసుల్లో ఎంత శాతం
మహారాష్ట్ర                                    24.59
ఢిల్లీ                                            10.96
గుజరాత్                                     10.88
రాజస్థాన్                                        8.30
మధ్యప్రదేశ్                                    8.11
తమిళనాడు                                  8.00
ఉత్తరప్రదేశ్                                    6.81
తెలంగాణ                                      4.84
ఆంధప్రదేశ్                                     3.98
కర్ణాటక                                         2.18
కేరళ                                            2.14
పశ్చిమబెంగాల్                               2.06