‘నాటా’ శ్రీధర్ రెడ్డికి మాతృ వియోగం

August 01, 2020

కావలి నియోజకవర్గంతోపాటు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కూడా పేరు ప్రఖ్యాతలున్న కోర్సపాటి గోపాలరెడ్డి గారి సతీమణి కోర్సపాటి సీతమ్మ(76) మే 20న (బుధవారం రాత్రి) తుదిశ్వాస విడిచారు. నిఖార్సయిన కాంగ్రెస్ నేతగా కొనసాగిన గోపాలరెడ్డి గారి సేవా కార్యక్రమాలను ఆయన సతీమణి కోర్సపాటి సీతమ్మగారు కొనసాగించారు. కడవరకు తన స్వగ్రామం కొండబిట్రగుంటలో ప్రజలకు, అనుచరులకు అందుబాటులో ఉన్నారు. గోపాలరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన అడుగుజాడల్లో నడిచిన సీతమ్మ....పలు సేవాకార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. సీతమ్మగారు స్వర్గస్తులవడంతో పెద్దదిక్కును కోల్పోయామని  ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీతమ్మకు ముగ్గురు కుమార్తెలు, ఒక్క కుమారుడు. సీతమ్మ పెద్ద కుమార్తె, చిన్న కుమార్తె నెల్లూరులో స్థిరపడగా....రెండో కుమార్తె, కుమారుడు అమెరికాలో స్థిరపడ్డారు. సీతమ్మ కుమారుడు కోర్సపాటి శ్రీధర్ రెడ్డి....ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అమెరికాలోని ప్రముఖ భారతీయులలో ఒకరిగా శ్రీధర్ పేరు తెచ్చుకున్నారు. అమెరికాలోని పలు తెలుగు సంఘాలతో ఆయనకు మంచి పరిచయాలున్నాయి. త్వరలోనో నాటా అధ్యక్షుడిగా శ్రీధర్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు.
కోవిడ్-19 విపత్తు నేపథ్యంలో విధించిన  ట్రావెల్ బ్యాన్ వల్ల అమెరికా నుంచి భారత్ కు శ్రీధర్ రెడ్డి రావడంలో జాప్యం జరిగింది. అధికారుల దగ్గర నుంచి అన్ని ప్రత్యేక అనుమతులు తీసుకొనేందుకు శ్రీధర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి మే 26 నాటికి భారత్ చేరుకోవచ్చని....ఆయన వచ్చిన తర్వాతే సీతమ్మ అంత్యక్రియలు చేయాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. అప్పటివరకు సీతమ్మ  పార్థివ దేహాన్ని మార్చురీలో ఉంచాలని నిర్ణయించారు. సీతమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలని...ఈ కష్టకాలంలో  శ్రీధర్ రెడ్డిగారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని నాటా కోరుకుంటోంది.