సినీ నిర్మాతల రారాజు..దగ్గుబాటి రామానాయుడు

August 07, 2020

‘‘కర్మవీరులు దుర్విమర్శల్ని కాలరాచి పురోగమిస్తారు... కారు మబ్బులను చీల్చి సూర్యుడిలా వాడిగా, వడివడిగా ముందుకురుతారు’’ అని ఎప్పుడో డా।। సినారె అన్నారు. ఈ సూర్తి పద్మభూషన్‌ డా।। దగ్గుబాటి రామానాయుడుకి సరిగ్గా వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన స్వాతిశయం మూర్తీభవించిన కళా ఆరాధకుడు. సంప్రదాయ కళలకు పట్టం కట్టినవాడు. చిత్ర పరిశ్రమలోవున్న అన్ని శాఖల్లోనూ అభినివేశమున్న వ్యక్తి. సినీ ప్రస్థానంలో జీవస్మరణ సమస్య ఎదురైనప్పుడు మనోధైర్యంతో ఎదురొడ్డి నిలిచి, ‘ప్రేమనగర్‌’ నిర్మించి. గెలిచి, ఆ గెలుపే ఊపిరిగా నిలుపుకొని శతాధిక చిత్రాలను ప్రేక్షకులకందించిన ఘనత ఈయనదే. ‘దాదా’ ఫాల్కే అవార్డు గ్రహీత  అయిన రామానాయుడు వర్ధంతి (ఫిబ్రవరి 18) ఈరోజు.  ఈ సందర్భంగా ఈ సోగ్గాడి జీవితంలోకి ఓ సారి తొంగి చూద్దాం!

కారంచేడు ప్రకాశం జిల్లాలో ఆదర్శ రైతులుండే పెద్ద గ్రామం. ఆ వూర్లో దగ్గుబాటి వెంకటేశ్వర్లు మోతుబరి రైతు. జూన్‌ 6, 1936న పుట్టిన రామానాయుడు అతనికి గారాల బిడ్డడు. చిన్నతనంలోనే తల్లి చనిపోగా, పిన తల్లి పెంపకంలో పెరిగాడు. అందగాడు, అందరూ ‘‘నాయుడమ్మా’’ అని ఆప్యాయంగా పిలిచేవారు. చిన్నప్పుడు డాక్టరు కావాలనే కోరిక వుండేది. కాలేజీలో చేరాక, సాంస్కృతిక కార్యక్రమాలపై మోజుతో చదువు మూల పడింది. కారంచేడు వచ్చి వందెకరాల సుక్షేత్రమైన భూమిలో వ్యవసాయానికి ఉపక్రమించాడు. గట్టుమీద నిలబడి పెత్తనం చెయ్యకుండా కూలీలతో బాటు తను కూడా దుక్కి దున్ని, నాట్లు వేసేవాడు. ‘‘పని చెయ్యి- చేయించు’’ అనే సిద్ధాంతాన్ని నమ్మి, ఆధునిక వ్యవసాయ పద్ధతుల అమలుతో ఆదర్శరైతు అనిపించుకున్నాడు. 1957 నవంబరులో మామకూతురు రాజేశ్వరితో పెళ్లయింది. 1958 డిసెంబరులో సురేష్‌ పుట్టాడు. వ్యవసాయంతో బాటు రైసుమిల్లు, ట్రాన్సుపోర్టు వ్యాపారం చేశాడు. రామానాయుడు సమీప బంధువులు యార్లగడ్డ వెంకన్న చౌదరి, లక్ష్మీనారాయణ మరి కొందరి భాగస్తులు కలిసి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ‘నమ్మినబంటు’ సినిమా తీస్తున్నారు. షూటింగులో చాలాభాగం కారంచేడులోనే జరిగింది. ఎడ్ల పందేల సన్నివేశంలో నాయుడమ్మ కూడా నటించాడు. షూటింగుకి వచ్చిన అక్కినేని నాయుడిని సినిమాల్లో నటించమని ప్రోత్సహించారు. అది తనకు ఇష్టంలేదు. ఆర్టిస్టులందరికీ అక్కడే తన ఇంట్లోనే బస, భోజనం. ఎస్వీ రంగారావైతే షూటింగు షెడ్యూలు ముగిశాక నాలుగురోజులు కారంచేడులోనే వుండి నాయుడమ్మ అతిధ్యం ఆస్వాదించారు.

మద్రాసుకి మకాం- సినీనిర్మాణం...
అప్పట్లో నాయుడు బంధువర్గానికి చెందిన ఎనిమిది కుటుంబాలవారు మద్రాసు వెళ్లి ఇటుక బట్టీ వ్యాపారం మొదలెట్టి బాగానే సంపాదించారు. తను కూడా ఇటుక వ్యాపారం చేద్దామని నాయుడు మద్రాసు చేరుకున్నారు. ఇటుక బట్టీల వ్యాపారం నచ్చక, మహాబలిపురంలో కీలంబాక్కం వద్ద యాభైవేలు వెచ్చించి వందెకరాల భూమికొన్నారు. సైడ్‌ వ్యాపారం కింద ‘ఆంధ్రాభవన్‌’ హోటల్లో భాగస్వామిగా చేరారు. తీరిక సమయాల్లో ‘ఆంధ్రాక్లబ్‌’కు వెళ్ళే వారు. అక్కడకు నటులతోపాటు దర్శక నిర్మాతలు కూడా వస్తుండేవారు. దర్శకుడు గుత్తా రామినీడు ఆ క్లబ్బుకి సెక్రటరీ. రామానాయుడుకి అతనితో పరిచయమైంది. ఆ సమయంలో నిర్మాత డూండీ, తమిళంలో శాండో చిన్నప్ప దేవర్‌ తీసిన ‘నీలమలై తిరుడన్‌’ సినిమాని ‘కొండవీటి దొంగ’ పేరుతో డబ్ చేసి కేవలం 20వేల పెట్టుబడితో లాభాలను ఆర్జించాడం విని రామానాయుడు తనుకూడా అటువంటి ప్రయత్నం చేద్దామని రామినీడు సలహా కోరారు. డబ్బింగ్‌ సినిమాలు అన్నీ సక్సస్‌ కావని, కారంచేడువాళ్ళే తన దర్శకత్వంలో ‘అనురాగం’ అనే సినిమా తీస్తున్నారని, వారితో భాగస్వామి అయితే బాగుంటుందని సలహా ఇవ్వడంతో కారం చేడు వెళ్ళి డబ్బు తెచ్చి ,50వేలు పెట్టుబడి పెట్టారు. అలా 1962 జూన్‌లో కుటుంబ సమేతంగా మద్రాసులో కాలుమోపి, విజయ రాఘవాచారి రోడ్డులోని, B.N. కొండారెడ్డి ఇంట్లో 220 రూపాయల అద్దెకు దిగారు. నాయుడు పెట్టుబడి పెట్టటం చూసి మరి కొందరు కారంచేడు మిత్రులు కూడా ఈ సినిమాలో పెట్టుబడి పెట్టారు. రామానాయుడు రామినీడుతో ‘‘నేను ప్రతి పనిలో ఇవ్వాల్వ్‌ అవుతాను. అవసరమైతే ప్రొడక్షన్‌ బాయ్‌గా కూడా పనిచేసేందుకు వెనుకాడను. సినిమా నిర్మాణం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. తెరమీద నా పేరు పడాలనే ఉబలాటం నాకు లేదు’’ అని ముందుగానే చెప్పి హామీ తీసుకున్నారు. భానుమతి, జి.వరలక్ష్మి, జానకి, సూర్యకాంతం, గుమ్మడి, హరనాథ్‌ వంటి మేటి తారాగణంతో తీసిన ‘అనురాగం’ సినిమా విడుదల నాటికి కుండపోతగా వర్షాలు పడడంతో ప్రేక్షకుల అభిమానానికి చేరువకాలేకపోయింది. ఫలితం పెట్టుబడి మొత్తం నష్టమే! తొలి పెట్టుబడి నిరుపయోగమైనా సినిమా తీసే మెళకువలన్నీ ఆకలింపు చేసుకోగలిగారు. నాయుడుకి పట్టుదల పెరిగింది. రెండు, మూడు సినిమాలు పోయినా పరవాలేదు కానీ సక్సెస్‌ కావాలి. వెంటనే మరో సినిమా తీయాలనుకుంటే, పార్టనర్లెవరూ ముందుకు రాలేదు. అందుకే ఒంటరి ప్రయాణానికి సిద్ధపడ్డారు. అతను వేసిన ‘ముందుడుగు’ అతని గమనాన్నే మార్చేసింది. ఆ నమ్మకమే‘సురేష్‌ ప్రొడక్షన్స్‌’ ఆవిర్భావానికి నాంది పలికింది. కథాన్వేషణలో పడ్డారు. కొసరాజు రాఘవయ్యను కలిస్తే ఆయన డి.వి.నరసరాజను, తాపీ చాణక్యను పరిచయం చేసారు. నరసరాజు వద్ద కాలహరణం పట్టి, ఆటకెక్కిన, ‘రాముడు-భీముడు’ ద్విపాత్రాభినయ స్క్రిప్టు రెడీగావుంది.

అంతకుముందు దాన్ని ఎందరో నిర్మాతలు, హీరోలు తిరస్కరించారు. కానీ నాయుడికి నచ్చింది. చాణక్యను దర్శకుడిగా ఎంపిక చేస్తే విమర్శలు వచ్చాయి. కారణం అతడు తీసిన తొమ్మిది సినిమాలు వరసగా ఫ్లాపులవటమే. నాయుడు ఆలోచన వేరు, ఎన్టీఆర్‌ని సంప్రదించారు. కథనచ్చింది. ‘‘ప్రొసిడ్‌ బ్రదర్‌’’ అంటూ కాల్షీట్లిచ్చారు. విజయా పిక్చర్స్‌ పెట్టుబడికి ముందుకొచ్చారు. తారాగణం ఎంపిక పూర్తియింది. అలా 1963 నవంబరులో 16న సురేష్‌ సంస్థ తొలిచిత్ర క్లాప్‌ ఎన్టీఆర్‌ మీద మోగింది. ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం పెరగటంతో ఖాళీ వున్నపుడల్లా కాల్షీట్లు తీసుకుని, నాయుడు ముందుచూపుతో ‘రాముడు-భీముడు’ సినిమాని నాలుగు నెలలలోనే పూర్తిచేసి 1964 మే 21న ఏకంగా 30కేంద్రాల్లో విడుదల చేయగలిగారు. ఆ సినిమా అద్భుత విజయాన్ని సాధించి, నాయుడికి రెట్టింపు లాభాలు అర్జించి పెట్టింది. అన్ని కేంద్రాల్లోనూ 10 వారాలకు పైగా ఆడి, 10 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. వెంటనే ఎన్టీఆర్‌తో ‘శ్రీ కృష్ణ తులాభారం’ తీయాలని ఆశించిన నాయుడుతో, ఎన్టీఆర్‌ తను ‘వీరాభిమన్యు’లో అదే పాత్ర పోషిస్తునానని, కొంత గ్యాప్‌ ఇచ్చి చేద్దామని చెప్పి ఈ లోగ ఏదైన చిన్న సినిమా ప్లాన్‌ చేసుకోమని సలహా ఇచ్చారు. ఖాళీగా వుండటం ఇష్టంలేని నాయుడు కొన్ని కాశీ మజిలీ కథలను మధించి కాంతారావు హీరోగా, సి.ఎస్‌.రావుతో ‘ప్రతిజ్ఞాపాలన’ అనే జానపదచిత్రాన్ని నిర్మించారు. సినిమా బాగానే ఆడి లాభాలు గడించిపెట్టింది. దాంతో రామానాయుడుకి చిత్ర పరిశ్రమలో గుర్తింపు వచ్చింది. తరవాత వరసగా ఎన్టీఆర్‌తో ‘శ్రీకృష్ణ తులాభారం’, ‘స్త్రీజన్మ’ చిత్రాలు తీసారు. పెద్దగా లాభాలు రాకపోయినా ఈ సినిమాలు నాయుడుకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

జయాపజయాలు- సోపానాలు
సాహస ప్రయోగాలు చేసి విజయాలు అందుకోవడమంటే నాయుడికి సరదా. 1968లో తన ఐదో చిత్రం ‘పాపకోసం’ కొత్త దర్శకుడు జి.వి.ఆర్‌.శేషగిరిరావుని పరిచయం చేసారు. సినిమా బాగా ఆడటంతో దాన్నే తమిళంలో ‘కొళందైకాగ’ పేరిట రీమేక్‌ చేసారు. తమిళంలో నాయుడుకి అదే మొదటి సినిమా. తరువాతి చిత్రం ‘బొమ్మలు చెప్పిన కథ’ అప్పటికే కృష్ణ- విజయనిర్మలకు మంచి హిట్‌ పెయిర్‌ అని పేరుంది. కానీ, ఈ సినిమాలో కృష్ణ సరసన గీతాంజలిని, కాంతారవు సరసన విజయనిర్మలను నటింప చేయడంతో సినిమా ఆడలేదు. తరవాత రామానాయుడు అక్కినేనితో ‘సిపాయి చిన్నయ్య’ తీసారు. అదే సమయంలో విడుదలైన పద్మశ్రీ వారి ‘ప్రాణమిత్రులు’ సినిమా ‘సిపాయి చిన్నయ్య’, విజయాన్ని దెబ్బతీసింది. కె.బాపయ్యను దర్శకునిగా పరిచయం చేస్తూ నాయుడు చేసిన మరో ప్రయోగం ‘ద్రోహి’ సినిమా నిరాశపరిచి, నాయుణ్ణి నష్టాల్లోకి దించింది. దాదాపు 12 లక్షలు నష్టం వచ్చినా ‘‘పోయిన దగ్గరే వెదుక్కోవాలి’’ అనే సూత్రాన్ని నమ్మిన ఈ కృషీవుడు అధైర్యపడలేదు. నవయుగ డిస్ట్రిబ్యూటర్లు వారించినా నాయుడు వినలేదు. నేను `ప్రేమనగర్‌’ నవలని  చిత్రంగా  తీస్తాను. 10 లక్షలు పెట్టుబడి పెట్టి సహకరించండి. 5 లక్షలు నేను పెట్టుకుంటాను’’ అంటే నవయుగవాళ్ళు ‘‘మీరు అసలే నష్టాల్లో వున్నారు. రిస్కు తీసుకుంటున్నారు. బాగా ఆలోచించుకోండి’’ అని వారించినా నాయుడు వినలేదు. ‘‘ఇది నా ఆఖరి ప్రయత్నం, తప్పక విజేతనౌతాను’’ అంటూ మొండి పట్టుదలతో నాయుడు ‘‘ప్రేమనగర్‌’ నిర్మాణానికి పూనుకున్నారు. వాహిని స్టూడియోలో 1971 జనవరి 20న షూటింగు మొదలైంది. ఆ రోజు నుంచే టీం సభ్యులతో ‘‘నిర్మాతగా నా భవిష్యత్తును నిర్ణయించే సినిమా ఇది. మద్రాసులో ఉండాలా లేక మహాబలిపురం వెళ్లి వ్యవసాయం చెయ్యాలా అని నిర్ణయించే సినిమా కూడా ఇదే. అంతా మీ చేతుల్లోనే వుంది’’ అంటూ ఉత్తేజితుల్ని చేస్తుండేవారు రచయిత ఆచార్య ఆత్రేయ, దర్శకుడు ప్రకాశరావు చెమటోడ్చి, శ్రమించి ‘దేవదాసు’ని మరిపించేంత గ్రేట్‌ మూవీగా ‘ప్రేమగనర్‌’ని తయారు చేసారు.

అక్కినేని నాగేశ్వరరావు జన్మదిన కానుకగా సెప్టెంబరు 21న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, భార్యా సమేతంగా ఫస్టు రీలు తీసుకొని తిరుపతి వెళ్లి దైవదర్శనం చేసుకొని, విజయవాడ చేరారు. అక్కడ కుంభవృష్టి వీరికి స్వాగతం పలికింది. నాయుడు నీరసపడ్డారు. హోటల్‌ గదికే పరిమితమయ్యారు. అంత వర్షంలోనూ హౌస్‌ఫుల్‌ కలక్షన్లతో థియేటర్లు నిండాయి. విజయవాడ నుంచి విశాఖపట్నం దాకా ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతున్నా ‘ప్రేమనగర్‌’ సూపర్‌హిట్‌ టాక్‌ తీసుకొచ్చింది. ‘‘మద్రాసులోనే నాయుడు భవిష్యత్తు’’ అని తిరుపతి వెంకన్న దీవనలిచ్చాడు. ఇక నాయుడు పట్టిందల్లా బంగారమే. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ఈ సినిమా తరవాత రామానాయుడుకి విజయాలు వెన్నంటి నడిచాయి. అతడు ఒక సెంటిమెంటుని నమ్మేవారు. అది... 60వ దశకంలో ప్రారంభమైన ‘అనురాగం’ సినిమా ఫ్లాపు. రెండో సినిమా ‘రాముడు- భీముడు’ సంచలన విజయం. అలాగే 70వ దశకంలో తొలి సినిమా ‘ద్రోహి’ ఫ్లాప్. మలిచిత్రం ‘ప్రేమనగర్‌’ అపూర్వ విజయం. తమిళంలో ‘ప్రేమనగర్‌’ని ‘వసత మాళిగై’ పేరుతో శివాజీ గణేశన్‌ని పెట్టి తీస్తే అది ‘ప్రేమనగర్‌’ సినిమాను మించి నిలిచింది. తరవాత శోభన్‌ బాబుతో ‘జీవనతరంగాలు’ రాజేష్‌ ఖన్నాతో హిందీ ‘ప్రేమనగర్‌’ ఏకకాలంలో తీశారు. హిందీ ‘ప్రేమనగర్‌’ హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించింది. తెలుగులో ‘జీవనతరంగాలు’ కూడా విజయవంతమైంది. సురేష్‌ సంస్థకు మంచి గుర్తింపు వచ్చింది. తరవాత తీసిన ‘చక్రవాకం’ నిర్మాణదశలో వుండగా ఎస్వీ రంగారావు చనిపోవడంతో కథాపరంగా మార్పులు అవసరమయ్యాయి. ఆ మార్పువల్ల సినిమా గొప్పగా ఆడలేదు. 1975లో వచ్చిన ‘సోగ్గాడు’ సినిమా రికార్డుల్ని తిరగరాసింది. హిందీలో జితేంద్రను పెట్టి ‘దిల్‌ దార్‌’ పేరిట రీమేక్‌ చేస్తే అక్కడ కూడా బంపర్‌ హిట్టై కూర్చుంది. శోభన్‌ బాబుకి ‘సోగ్గాడ’నే పేరు సార్థకమైంది. హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియో నిర్మించాక ప్రారంభోత్సవ చిత్రం నాయుడు తీసిన ‘సెక్రటరీ’ నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహమ్మద్‌ హాజరై ఆ సినిమాకు తొలి క్లాప్‌ తన భార్యచేత ఇప్పించడం విశేషం. సినిమా రిపీట్‌ రన్లో బాగా ఆడింది.

హైదరాబాదులో ‘సినీ నిజాం’
ఈ సంఘటనే రామానాయుడుని హైదరాబాదుకు మకాం మార్పించేలా చేసింది. అంతేకాదు స్టూడియో నిర్మాణానికి కూడా  బీజం పడింది. బోయిన సుబ్బారావుని దర్శకునిగా పరిచయం చేస్తూ రామానాయుడు ‘సావాసగాళ్ళు’ సినిమా తీసారు. సినిమా మంచి హిట్టై వరస ప్లాపులతో సతమతమౌతున్న కృష్ణను మళ్లీ నిలబెట్టింది. హాస్యనటుడు నగేష్‌కి దర్శకత్వ బాధ్యతలు ఇచ్చి తీసిన ‘మొరటోడు’ దెబ్బతింది. ‘చిలిపి కృష్ణుడు’ ‘మండేగుండెలు’ బాగానే ఆడాయి. 80వ దశకంలో నాయుడుకి అటు విజయాలూ, ఇటు ఎదురుదెబ్బలూ రెండు వున్నాయి. 80వ దశకంలో వచ్చిన తొలి సినిమా ‘కక్ష’ అనుకున్నట్లే ఫ్లాప్‌ అయింది. రెండో చిత్రం ‘చిలిపి కృష్ణుడు’ హిందీ రిమేక్‌ ‘బందిష్‌’, విజయవంతమైంది. ‘అగ్నిపూలు’, ‘ప్రేమమందిరం’ ఫెయిలైతే, ‘దేవత, ‘ముందడుగు’ సినిమాలు అద్భుత విజయాలను అందించాయి. ఈ దశకంలో నాయుడుకి ఆరు వరుస హిట్లు తగిలాయి. కె. మురళీ మోహనరావు (సంఘర్షణ), బి. గోపాల్‌ (ప్రతిధ్వని)ను కూడా రామానాయుడే దర్శకులుగా పరిచయం చేసారు. కృష్ణ కాల్షీట్లు కష్టమవటంతో అమెరికాలో చదువుకుంటున్న తన కుమారుడు వెంకటేష్‌ని రప్పించి ‘కలియుగ పాండవులు’లో హీరోగా పరిచయం చేస్తే అతుడు ‘విక్టరీ’ వెంకటేష్‌గా పేరు తెచ్చుకున్నాడు. భవనం వెంకట్రామరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా స్టూడియో నిర్మాణానికి స్థల కేటాయింపు జరిగింది. దాంతో ‘రామానాయుడు స్టూడియో’ అధునూతన వసతులతో తయారైంది. ‘బొబ్బిలిరాజా’, ‘సూరిగాడు’ వంటి చిత్రాలతో బాటు 50 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో రామానాయుడు మొత్తం 115 స్ట్రెయిట్‌ చిత్రాలు, 17 దాకా డబ్బింగు చిత్రాలు నిర్మించారు. సొంత పంపిణీ సంస్థని కూడా ఏర్పాటుచేసుకున్నారు. అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించి, ఇప్పుడు విశాఖపట్నంలో కూడా స్టూడియో నిర్మాణం పూర్తిచేశారు. 1999 లో పార్లమెంటు సభ్యునిగా బాపట్ల నియోజకవర్గం నుండి ఎన్నికై రాజకీయాలు తన ఒంటికి పడవని వాటికి దూరంగా ఉన్నారు. రామానాయుడుకి డైరెక్టు చెయ్యాలని, తన కుటుంబ సభ్యులందరితో కలిపి ఒక సినిమా తీయాలని కోరికలు మిగిలున్నాయి. ఆ కోరికలు తీరే కుండానే స్వర్గానికి’’ (ఫిబ్రవరి 18, 2015) పయనమైపోయారు.

సౌజన్యం: ఆచారం షణ్ముఖాచారి

 

RELATED ARTICLES

  • No related artciles found