ఎమ్మార్వోని తగలబెట్టింది ఎవరు?

July 14, 2020

హైద‌రాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్‌లో త‌హ‌శీల్దార్‌ను పెట్రోల్ పోసి త‌గ‌లబెట్టిన అమానుష ఘ‌ట‌న‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.త‌హసీల్దార్ కార్యాలయంలోనే తహసీల్దార్ విజయరెడ్డిపై దుండగుడు పెట్రోలు పోసి నిప్పింటించాడు. ఈ ఘ‌ట‌న‌కు ముందు ప‌లు నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ప్ర‌త్య‌క్ష సాక్షుల ప‌థ‌కం ప్ర‌కారం...గుర్తుతెలియని వ్యక్తి నేరుగా ఆఫీసులోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. అతడిని అడ్డుకునేందుకు అటెండర్ ప్రయత్నించగా...  తహశీల్దార్ తనను రమ్మన్నారని చెప్పి.. చాంబర్ లోకి వెళ్లాడని తెలుస్తోంది.
దాదాపు అరగంటపాటు ఆమె రూమ్‌లో ఉన్న నిందితుడు  మాట్లాడుతూ.. మాట్లాడుతూనే ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఏం జరుగుతోందో తెలీక విజయ ఆఫీసులో హాహాకారాలు పెట్టింది. క్ష‌ణాల్లో ఒళ్లంతా మంటలు అంటుకుని, ఆ బాదకు కేకలు పెడుతూ కకావికలమైపోయిందామె. సిబ్బంది మంటలార్పి రక్షించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ ప్రయత్నంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

తహశీల్దార్ విజయ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, నిందితుడు గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్‌గా గుర్తించారు. భూ సంబంధ‌మైన అంశాల్లోనే ఇలా అత్యంత పాశ‌వికంగా వ్య‌వ‌హ‌రించాడ‌ని స‌మాచారం. కాగా, హంతకుడికి హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.
ఇదిలాఉండ‌గా, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఈ ఘ‌ట‌నపై తీవ్రంగా స్పందించింది. ఉద్యోగులంతా...విధులను బహిష్కరించి నిరసన తెలపవలసిందిగా సంఘం అధ్య‌క్షుడు వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి  కే.గౌతమ్ కుమార్ పిలుపునిచ్చారు.``పట్టపగలు ఒక మహిళా ఉద్యోగిని ఇలా క్రూరంగా హత్య చేయటం అత్యంత దారుణం. చాలా హేయమైన చర్య.దీని పై ప్రభుత్వం వెంటనే స్పందించాలి.ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పించాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏవిధంగా పనిచేయాలని మా మహిళా ఉద్యోగులు విలపిస్తూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకంటే ఘోరమైన అన్యాయం ఉండదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.దోషుల్ని ఎంతటి వారైనా వదలవద్దు. ఇలాంటి సమయంలో రెవిన్యూ ఉద్యోగులందరు ఏకతాటిపై ఉండాలి. మనోనిబ్బరంతో ,ధైర్యంగా ఈ పరిస్థితి ఎదుర్కుందాము. విధులు బ‌హిష్క‌రించి నిర‌స‌న తెలుపండి` అని ప్ర‌క‌టించారు.