జగన్ కోసమా?... ముద్రగడ అస్త్ర సన్యాసం

August 12, 2020

కాపు ఉద్యమంపై ముద్రగడ రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాదిపాటు మౌనంగా ఉన్న ముద్రగడ...తాజాగా కాపు ఉద్యమం బంతిని కేంద్రం కోర్టులో వేశారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముద్రగడ కాపు ద్రోహి అని, డబ్బులకు అమ్ముడుపోయి....జగన్ కు వత్తాసు పలుకుతున్నారంటూ కొందరు నెటిజన్లు తీవ్రస్థాయిలో దూషణలకు దిగుతున్నారు.

కాపులపై ముద్రగడకు చిత్తశుద్ధి ఉంటే..గత ప్రభుత్వాన్ని నిలదీసినట్లుగానే....ఈ ప్రభుత్వాన్ని నిలదీశేవారని నెటిజన్లు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఆ వ్యాఖ్యలపై మనస్తాపం చెంది ఉద్యమం నుంచి తప్పుకుంటున్నానని ముద్రగడ బహిరంగ ప్రకటన చేశారు. 

అయితే, గత ప్రభుత్వం హయాంలో ముద్రగడను జగన్ ప్రోత్సహించి ఉద్యమాలు చేయించారని ఆరోపణలున్నాయి. తుని ఘటన వెనుక వైసీపీ నేతలు, సీమకు చెందిన వ్యక్తులు ఉన్నారని తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. వైసీపీకి అనుకూలంగా ముద్రగడ వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి.

అయితే, జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అస్త్ర సన్యాసం చేస్తే బాగుండదని భావించిన ముద్రగడ ఏడాది పాటు వేచి చూశారన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఏడాదిపాటు జగన్ ను , వైసీపీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాటనని ముద్రగడ...ఇపుడు తన మనోభావాలు...మనస్తాపం అంటూ అస్త్ర సన్యాసం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా ప్రవర్తనతలో ముద్రగడ... జగన్ మనిషి అని మరోసారి ముద్ర వేయించుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఉద్యమనాయకులపై విమర్శలు, తిట్లు సర్వ సాధారణం. ఒక్క ముద్రగడకే విమర్శలు, తిట్లు పరిమితం కాదు. వామపక్షాలు, ఇతరత్రా ఉద్యమాలు చేసిన వారూ వీటికి మినహాయింపు కాదు. అయితే, వాటి పేరు చెప్పి ఉద్యమాన్నే నీరు గార్చడం, ఉద్యమం నుంచి తప్పుకోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. తనపై విమర్శలు వచ్చినందుకు ముద్రగడ ఉద్యమాన్ని వదిలేయాలనుకోవడంపై అన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాపుల ఉద్యమం...లేదా మరేదైనా ఉద్యమం కావచ్చు....ఉద్యమంలో ఉన్నపుడు విమర్శలు, దూషణలు సహజమని, వాటికే కుంగిపోయి ఉద్యమం వదిలేస్తామనడం విడ్డూరంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఇంత చిన్న విషయానికి ముద్రగడ మనస్తాపానికి లోనై....ఎన్నో ఏళ్లు నడిపిన ఉద్యమాన్ని నీరుగార్చడం వెనుక వేరే బలమైన కారణాలున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. జగన్ కు అనుకూలంగా ఉండేందుకు ముద్రగడ ఈ నిర్ణయం తీసుకున్నారేమో అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.